కస్టడీ పొడిగించిన రౌస్ అవెన్యూ కోర్టు
విధాత : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ కేసులో సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణ విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. కేజ్రీవాల్ అరెస్టులో పలు అంశాలను పరిశీలించాల్సి ఉందని కోర్టు పేర్కొంది. అరెస్టు అక్రమ అంటూ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ ను ఐదుగురు సభ్యుల విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది . కేజ్రీవాల్ అరెస్టులో పలు అంశాలు, సెక్షన్లు పరిశీలించాల్సి ఉందని కోర్టు అభిప్రాయపడింది.
కేజ్రీవాల్ 90 రోజులకు పైగా నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది. కేజ్రీవాల్ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధి.. ఆయన సీఎంగా కొనసాగాలా వద్దా అన్నది ఆయన ఇష్టమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈడీ కేసులో కేజ్రీవాల్ ఇంకా కస్టడీలో ఉండాల్సిన అవసరం లేదని న్యాయవాదులు కోర్టులో తమ వాదనలు వినిపించారు. ఈడీ తనను అరెస్టు చేయడాన్ని కేజ్రీవాల్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ కేసులో మద్యంతర బెయిల్ మంజూరు కావడం కేజ్రీవాల్‌కు ఊరటనిచ్చింది. అయితే సీబీఐ కేసులో కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ తీహార్ జైల్లోనే ఉండనున్నారు.
ఈ క్రమంలో కేజ్రీవాల్ సీబీఐ అరెస్టును ఢిల్లీ హైకోర్టులో సవాల్ చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. మరోవైపు సీబీఐ కస్టడీ శుక్రవారంతో ముగిసిపోగా, విచారణ నిమిత్తం సీబీఐ చేసిన అభ్యర్థన మేరకు రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కస్టడీని ఈ నెల 25వరకు పొడిగించింది. కాగా ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు కేజ్రీవాల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 19న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈడీ కస్టడీలో తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను అదే కేసులో జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేసింది. కేసుకు సంబంధించి గత రెండు వారాలుగా ఆయనన విచారిస్తుంది.