Site icon vidhaatha

ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు ఎందుకు?

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల ప్రారంభానికి ముందు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్టు చేయడాన్ని సుప్రీంకోర్టు ఏప్రిల్‌ 30, 2024న ప్రశ్నించింది. ‘అరెస్టు చేసిన సమయం సాధారణ ఎన్నికలకు కాస్త ముందు’ అని పేర్కొన్నది. జీవితం, స్వేచ్ఛ కూడా చాలా ముఖ్యమైనవని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా, జస్టిస్‌ దీపాంకర్‌ దత్తాలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. తదుపరి విచారణ జరిగే మే 3, 2024 నాటికి తన స్పందనను తెలియజేయాలని ఈడీని ధర్మాసనం ఆదేశించింది. దీనితోపాటు ఈడీనీ పలు కీలక ప్రశ్నలను కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం అడిగింది. ఎక్సయిజ్‌ పాలసీ కేసులో కేజ్రీవాల్‌ కచ్చితమైన పాత్ర ఏంటి?, న్యాయపరమైన ప్రొసీడింగ్స్‌ లేని సమయంలో ఆయనను అరెస్టు చేసి ఉండొచ్చు కదా? అని ప్రశ్నించింది. అదే సమయంలో స్కాం జరిగిన తర్వాత కేజ్రీవాల్‌ అరెస్టు వరకూ ఇంత సుదీర్ఘకాలం ఎందుకు ఉన్నదో తమను సంతృప్తిపరిచే సమాధానం చెప్పాలని కోరింది. కేజ్రీవాల్‌ అరెస్టుకు ఈడీ చెబుతున్న నాలుగు స్టేట్‌మెంట్‌లను ఆయన తరఫున హాజరైన సీనియర్‌ అడ్వొకేట్‌ ఏఎం సింఘ్వి విచారణ సందర్భంగా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఈ స్టేట్‌మెంట్లు ఇచ్చిన నలుగురూ ఎంతోకొంత లబ్ధి పొందినవారేనని వివరించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డితో బలవంతంగా కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం ఇప్పించారని ఆరోపించారు. తన కొడుకు రాఘవ్‌కు బెయిల్ కోసమే శ్రీనివాసులురెడ్డి సాక్ష్యం చెప్పారని పేర్కొన్నారు. తన కొడుకు దీర్ఘకాలంగా జైల్లో ఉండటాన్ని భరించలేక కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చారని అన్నారు. రాఘవ్‌కు బెయిల్‌ వచ్చిన మరుసటి రోజే మాగుంట శ్రీనివాసులురెడ్డి ముందు ఇచ్చిన స్టేట్‌మెంట్‌కు భిన్నంగా మాట మార్చారని ఆరోపించారు. ‘కేజ్రీవాల్‌ అనుచరుడు విజయ్‌నాయర్‌ ముడుపులు అందుకున్నారని ఆరోపిస్తున్నారు.

ఆయనను 2022 నవంబర్‌లో అరెస్టు చేస్తే కేజ్రీవాల్‌ను మార్చి 2024లో అరెస్టు చేశారు. ఈ సమయంలో కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేశారంటే వివరణ లేదు’ అని సింఘ్వి ప్రస్తావించారు. ‘రాఘవ్‌ మొదట్లో ఎలాంటి ఆరోపణలు చేయలేదు. ఆయన భార్య ఆత్మహత్యకు ప్రయత్నించారు. తాత్కాలిక బెయిల్‌ కోరితే.. ప్రత్యేక కోర్టు జడ్జి నిరాకరించారు. ఆయన అమ్మమ్మ కిందపడి, ఐసీయూలో చేరారు. ఢిల్లీ హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. దానిని ఈడీ సవాలు చేసింది’ అని సింఘ్వి తెలిపారు. రాఘవ్‌ తండ్రి స్టేట్‌మెంట్‌ ఇవ్వగానే ఆయన బెయిల్‌ పిటిషన్‌కు ఈడీ అభ్యంతరం చెప్పలేదు. దయచేసిన దీనిని అర్థం చేసుకోండి. అప్రూవర్‌షిప్‌ విషయంలో ప్రహసనం నడుస్తున్నది’ అని సింఘ్వి వాదించారు. ఏప్రిల్‌ 29, 2024న విచారణ సందర్భంగా మార్చి 21న ఈడీ అరెస్టు అనంతరం బెయిల్‌ కోసం దిగువ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని కేజ్రీవాల్‌ను కోర్టు ప్రశ్నించింది.

దీనికి మంగళవారం విచారణ సందర్భంగా సీనియర్‌ అడ్వొకేట్‌ అభిషేక్‌ మను సింఘ్వి స్పందిస్తూ.. ఒక్క బెయిల్‌ పొందటమే కాకుండా.. అసలు తన అరెస్టు చెల్లుబాటును కేజ్రీవాల్‌ సవాలు చేయదల్చుకున్నారని చెప్పారు. మనీలాండరింగ్‌ చట్టం 2002లోని సెక్షన్‌ 19 ప్రకారం.. జరిగిందని చెబుతున్న కుంభకోణంలో కేజ్రీవాల్‌ పాత్రపై సహేతుక ప్రాతిపదిక ఉంటేనే అరెస్టు చేయాలని వాదించారు. కానీ వారి వద్ద ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది వారాల ముందు కేజ్రీవాల్‌ను మార్చి 21న ఈడీ తన కస్టడీలోకి తీసుకున్నదని చెప్పారు. ఈడీ అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ‘జీవితం, స్వేచ్ఛ చాలా ముఖ్యమైనవి, వాటిని ఎవరూ నిరాకరించలేరు’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆప్‌ నేతను అరెస్టు చేసిన సమయంపై సమాధానం ఇవ్వాలని అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఎస్వీ రాజును ధర్మాసనం ఆదేశించింది. ఈడీ దురుసగా వ్యవహరించిందని అంతకు ముందు కేజ్రీవాల్‌ ఆరోపించారు.

Exit mobile version