Sarath Chandra Reddy | ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం

ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారారు

  • Publish Date - April 19, 2024 / 06:10 PM IST

అప్రూవర్‌గా మారిన శరత్ చంద్రారెడ్డి

విధాత : ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. గతంలో ఈడీ కేసులో అప్రూవర్‌గా మారిన నిందితుడు శరత్ చంద్రారెడ్డి, సీబీఐ నమోదు చేసిన కేసులోనూ అప్రూవర్‌గా మారారు. సెక్షన్ 164 కింద సీబీఐ కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆయన వాంగ్మూలాన్ని ప్రత్యేక కోర్టు జడ్జి కావేరి భవేజా నమోదు చేసుకున్నారు. దీంతో మద్యం వ్యవహారంలో సీబీఐ, ఈడీ వేర్వేరుగా నమోదు చేసిన 2 కేసుల్లోనూ శరత్ చంద్రారెడ్డి అప్రూవర్‌గా మారినట్లయ్యింది. లిక్కర్‌ కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ్, దినేశ్ అరోరా అప్రూవర్లుగా మారారు. ఈ కేసులో ఇటీవల బీఆరెస్‌ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 23 వరకు సీబీఐ కోర్టు కవితకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.

కవిత పాత్రలో ప్రధాన సాక్ష్యం శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలమే

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆరెస్‌ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటో సీబీఐ కోర్టుకు తెలిపింది. ఆప్‌కు కవితనే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్టులో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డిని రూ.25 కోట్లు కవిత డిమాండ్ చేశారని న్యాయస్థానానికి వివరించింది. శరత్ చంద్రారెడ్డి కవిత జాగృతి సంస్థకు రూ. 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు సీబీఐ తెలిపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని సీబీఐ వెల్లడించింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారని పేర్కోంది. లేని భూమిని అమ్మినట్లు చూపి శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. మహబూబ్ నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సీబీఐ చెబుతోంది. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను రూ.14కోట్లు ఇవ్వలేని శరత్ చంద్రారెడ్డి చెప్పారని, 14 కోట్లు ఇవ్వకపోతే అతనికి చెందిన తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ తన కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది.

అప్రూవర్లతోనే లిక్కర్ స్కామ్ కేసుకు బలం

లిక్కర్ స్కామ్ కేసులో అప్రూవర్లు శరత్‌రెడ్డి చంద్రారెడ్డి, మాగుంట రాఘవ, దినేష్ అరోరా చెబుతున్న వివరాలే కేసుకు బలం చేకూరుస్తూ వస్తున్నాయి. వారి వాంగ్మూలాల మేరకు ఒక్కో రిటైల్ జోన్‌కి రూ.5 కోట్లు చొప్పున 5 రిటైల్ జోన్‌లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు . ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25 కోట్లు చెల్లించారని సీబీఐ చెబుతోంది. ఇండో స్పిరిట్స్‌లో 65శాతం వాటా కవిత పొందారని.. సీబీఐ వాదిస్తుంది. నిందితులు అప్రూవర్లుగా మారి కవిత బెదిరిస్తేనే డబ్బులిచ్చామని చెప్పడంతో మునుముందు ఈ కేసులో కవితకు మరిన్ని సమస్యలు తప్పవన భావిస్తున్నారు.

Latest News