కులగణన నిర్వహించాలని కేంద్రాన్ని కోరుతూ … తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం

దేశవ్యాప్తంగా కుల గణన సహా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ జూన్‌ 26, 2024న ఏకగ్రీవ తీర్మానం చేసింది. వాస్తవానికి 2020లో జనాభా లెక్కల సేకరణ జరుగాల్సి ఉన్నది.

  • Publish Date - June 26, 2024 / 04:16 PM IST

చెన్నై: దేశవ్యాప్తంగా కుల గణన సహా జనాభా లెక్కల సేకరణ ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ జూన్‌ 26, 2024న ఏకగ్రీవ తీర్మానం చేసింది. వాస్తవానికి 2020లో జనాభా లెక్కల సేకరణ జరుగాల్సి ఉన్నది. కానీ.. కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో వాయిదా పడుతూ వచ్చింది. అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. దేశంలో కుల గణన ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. తమిళనాడులోని అనేక పార్టీలు, సామాజిక సంస్థలు చాలా కాలంగా కులగణన కోసం డిమాండ్‌ చేస్తున్నాయి. కులగణనతో బడుగు బలహీన వర్గాల వాస్తవ స్థితి గతులు తెలుసుకుని, వారికి వివిధ సంక్షేమ కార్యక్రమాలు, విధానాలు రూపొందించడం సాధ్యపడుతుంది. దేశంలోని ప్రతి పౌరుడికి ఉపాధి, ఆర్థిక వ్యవస్థ, విద్య తదితర రంగాల్లో సమాన హక్కులు లభించేలా విధానాల రూపకల్పనలో కుల ఆధారిత జనగణన అత్యంత కీలకంగా ఉంటుందని ఈ సభ భావిస్తున్నది’ అని తీర్మానం పేర్కొన్నది.

వనరులు, అవకాశాలను సమానంగా అందించేందుకు కుల ప్రాతిపదికన జనగణన ఉపకరిస్తుందని స్టాలిన్‌ చెప్పారు. తగిన వివరాలు, డాటా లేకపోవడంతో పలు కులాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నాయని అన్నారు. ఫలితంగా ఆర్థిక, సామాజిక అసమానతలకు ఆ సామాజిక వర్గాలు గురవుతున్నాయని చెప్పారు. అందుకే 2021 నుంచి పెండింగ్‌లో ఉన్న జనాభా లెక్కల సేకరణలో ఈసారి కులాల వారీగా కూడా వివరాలు సేకరించాలని సభ ఏకగ్రీవంగా కేంద్రాన్ని కోరుతున్నదని స్టాలిన్‌ తెలిపారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వానికి తనంతట తానుగా కులగణన జరిపే అధికారం ఉన్నదని పట్టలి మక్కల్‌ కచ్చి (పీఎంకే) సభ్యుడు ఆర్‌ అరుల్‌ అన్నారు. దీనికి రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఎస్‌ రేగుపతి స్పందిస్తూ.. గణాంకాల సేకరణ చట్టం 2008 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం కులాల వారీగా వివరాలు సేకరించే అవకాశం ఉన్నదని, కానీ.. జనగణన చట్టం దాని అధికారాలను తొలగించిందని చెప్పారు. ఈ తీర్మానానికి బీజేపీ సహా అన్ని పార్టీల సభ్యులు పార్టీలకు అతీతంగా మద్దతు ప్రకటించారు. దీంతో తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. తీర్మానానికి అన్నాడీఎంకే మద్దతు పలికినప్పటికీ ఓటింగ్‌ సమయంలో ఆ పార్టీ సభ్యులు సభలో లేరు. అంతకు ముందు సభా కార్యక్రమాలను అడ్డుకుంటున్నారంటూ అన్నాడీఎంకే సభ్యులందరినీ స్పీకర్‌ ఒక రోజు సభ నుంచి సస్పెండ్‌ చేశారు.

దేశవ్యాప్తంగా కులగణన అంశాన్ని ప్రతిపక్ష ఇండియా కూటమి ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో చర్చనీయాంశం చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ సహా ఇండియా కూటమి నేతలందరూ కులగణన డిమాండ్‌ను ప్రధానంగా ప్రస్తావించారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడుతామని రాహుల్‌ గాంధీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Latest News