Spy Cameras In Hostel : మహిళా హాస్టల్ లో స్పై కెమెరాలు..రెండు వేల మంది ఆందోళన!

తమిళనాడులోని కృష్ణగిరి జిల్లాలో ఒక ప్రముఖ కంపెనీకి చెందిన మహిళా ఉద్యోగుల హాస్టల్ టాయిలెట్లలో స్పై కెమెరాలు అమర్చిన ఘటన సంచలనం రేపింది.

Hosur Factory

విధాత : ఓ బడా కంపెనీ తన మహిళా ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న హాస్టల్ టాయిలెట్లలో స్పై కెమెరాలు అమర్చిన ఘటన వెలుగు చూడటం సంచలనంగా మారింది. ఈ ఘటన తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి ఒక టాయిలెట్‌లో స్పై కెమెరా గుర్తించిన మహిళలు ఆందోళనకు దిగారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఒక ప్రముఖ సంస్థ తమ ఉద్యోగుల కోసం ఈ వసతి గృహాన్ని నిర్వహిస్తోంది. అక్కడే ఉంటున్న ఒడిశాకు చెందిన ఒక మహిళా ఉద్యోగి టాయిలెట్ లో స్పై కెమెరాలను అమర్చింది. వాటితో రహస్యంగా వీడియోలు చిత్రీకరిస్తోంది.

ఆ హాస్టల్‌లోనే ఉంటున్న మరో మహిళకు ఆమె కదలికలపై అనుమానం వచ్చింది. తన అనుమానాన్ని నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లింది. వారు వెతకడంతో ఈ కెమెరాల గుట్టు బయటపడింది. ఈ విషయం బయటికి పొక్కడంతో తీవ్ర కలకలం రేగింది. అక్కడ వసతి పొందుతున్న సుమారు రెండువేల మంది మహిళలు ఆందోళనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితురాలిని అరెస్టు చేశారు. నిందితురాలు తీసిన వీడియోలను ఏం చేసిందన్నదానిపై విచారణ కొనసాగిస్తున్నారు.