Mumbai Court : కిరాణా సరుకులు ఆర్డర్ చేసిన ఓ మహిళకు ఆ సరుకులు డోర్ డెలివరీ ఇవ్వడం కోసం వచ్చిన యువకుడు ఆమెపట్ల అసభ్యంగా ప్రవర్తించిన కేసులో ముంబై కోర్టు తీర్పు వెలువరించింది. యువకుడి ప్రవర్తనను తప్పుపడుతూ అతడిని దోషిగా తేల్చింది. సదరు వ్యక్తి ఆ మహిళను అసభ్యంగా తాకడమే కాకుండా ఆమెకు కన్నుకొట్టినందున.. ఈ కేసు విచారించిన కోర్టు అతడిని దోషిగా నిర్ధారించింది.
వాస్తవానికి ఆ వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధించాలని కోర్టు భావించింది. కానీ అతడికి ఎలాంటి నేర చరిత్ర లేకపోవడం, చిన్న వయసు కావడంతో ప్రొబేషన్ బెనిఫిట్ ఇవ్వాలని ముంబై కోర్టు మేజిస్ట్రేట్ ఆర్తి కులకర్ణి నిర్ణయించారు. అయితే బాధిత మహిళ అనుభవించిన మానసిక వేదనను విస్మరించలేమని, అదే సమయంలో నిందితుడికి శిక్ష విధించడం వల్ల అతని భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని విచారణ సందర్భంగా కోర్టు వ్యాఖ్యానించింది.
అయితే ఐపీసీలోని సెక్షన్ 354 కింద నిందితుడు మహ్మద్ కైఫ్ ఫకీర్‌ను దోషిగా నిర్ధారించింది. రూ.15,000 జరిమానా కట్టించుకుని ఫకీర్‌ని విడుదల చేయాలని సూచించింది. అయితే పిలిచినప్పుడల్లా ఫకీర్ ప్రొబేషన్ ఆఫీసర్ ముందు హాజరుకావాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళ్తే.. 2022 ఏప్రిల్‌లో దక్షిణ ముంబైలోని బైకుల్లా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ కన్నుకొట్టిన ఘటన చోటుచేసుకుంది.
స్థానిక మహిళ కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేయగా.. ఆ కిరాణా దుకాణంలో పనిచేసే వ్యక్తి వాటిని డెలివరీ చేయడానికి మహిళ ఇంటికి వెళ్లాడు. ఆర్డర్ డెలివరీ ఇచ్చేటప్పుడు ఫకీర్ ఆమె చేతిని అభ్యంతరకరంగా తాకుతూ కన్నుకొట్టాడు. ఆ తర్వాత ఆమెను ఒక గ్లాస్ మంచి నీళ్లు అడిగాడు. ఆమె నీళ్ల గ్లాసు అందిస్తున్నప్పుడు మరోసారి ఆమె చేతులను తాకడంతోపాటు కన్నుకొట్టాడు.
మహిళ ఆగ్రహం వ్యక్తం చేయడంతో అతను అక్కడ నుంచి పారిపోయాడు. ఈ విషయాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో కేసు కోర్టు దాకా వెళ్లింది. అయితే కోర్టులో విచారణ సందర్భంగా సదరు వ్యక్తి మాట్లాడుతూ.. తాను పొరపాటున మహిళ చేతిని తాకానని, ఆమెను కించపరిచే ఉద్దేశం తనకు లేదని చెప్పాడు. కానీ సాక్ష్యాధారాలు, మహిళ వాంగ్మూలం నిందితుడి జోక్యాన్ని రుజువు చేసేంత బలంగా ఉన్నాయని అభిప్రాయపడ్డ కోర్టు అతడిని దోషిగా తేల్చి నామమాత్రపు శిక్ష వేసింది.