Bagmati Express Train Crash | న్యూఢిల్లీ : తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా కవరపేట స్టేషన్ సమీపంలో గతేడాది అక్టోబరు 11 రాత్రి మైసూరు-దర్బాంగ భాగమతి ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైన ఘటన వెనుక కుట్ర ఉందని కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ(సీఆర్‌ఎస్) సదరన్ సర్కిల్ ఎఎం చౌదరి తన నివేదికలో సంచలన అంశాలను వెల్లడించారు. ప్రమాదంలో రైలు మెయిన్ లైను నుంచి లూప్‌లైనుకు వెళ్లి అక్కడ ఆగి ఉన్న గూడ్స్‌రైలును ఢీకొట్టంది. ఆ సమయంలో రైలులో 1,800 మంది ప్రయాణికులు ఉండగా..ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరుగకపోయిన 19 మంది గాయపడ్డారు. భాగమతి ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదానికి సంబంధించి విచారణ జరిపిన సదరన్ సర్కిల్ ఏఎం చౌదరి రైల్వే బోర్డుకు ఇచ్చిన నివేదికలో సంచలన విషయాలు బయటపెట్టారు. ప్రమాద సమయంలో భాగమతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 13 బోగీలు పట్టాలు తప్పగా..ఒక బోగీ మంటల్లో చిక్కుకుంది అని చౌదరి నివేదించారు.
రైలు పట్టాల్లోని ఎల్ హెచ్ స్విచ్ పాయింట్ దగ్గర దురుద్దేశంతోనే ఫిట్టింగ్స్‌ను తొలగించారని పేర్కొన్నారు. ఈ ప్రమాదం వెనుక కుట్ర ఉందని తెలిపారు. రైల్వే పరికరాల్లో, ఆటోమెటిక్ సిగ్నలింగ్‌లో ఎలాంటి తప్పిదాలు లేవని నివేదికలో వెల్లడించారు. రైలు లోకోపైలట్ జీ.సుబ్రమణి ఈ ప్రమాదాన్ని గుర్తించి సమస్ఫూర్తితో వ్యవహరించారని..అత్యవసర బ్రేక్‌లు వేశారని, అందుకే ప్రమాద తీవ్ర తగ్గిందని చౌదరి తన నివేదికలో పేర్కొన్నారు. లోకోపైలట్ ప్రయత్నాన్ని రైల్వే మంత్రిత్వశాఖ గుర్తించాలన్నారు. ఈ విషయమై రైల్వే మంత్రిత్వ శాఖ స్పందిస్తూ.. సుబ్రమణికి ‘అతి విశిష్ఠ్ రైల్ సేవా పురస్కార్’ను ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించింది.