Lok Sabha Polls 2024 | యూపీలో నాలుగో దశ బీజేపీకి అంత ఈజీ కాదు.. ఎందుకంటే..!

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో విడుత పోలింగ్‌ ముగిసింది. అయితే.. ఈ దశలో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కీలకంగా ఉంటూ వస్తున్న యూపీలో

  • Publish Date - May 13, 2024 / 06:24 PM IST

లక్నో: లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా సోమవారం నాలుగో విడుత పోలింగ్‌ ముగిసింది. అయితే.. ఈ దశలో గత రెండు లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కీలకంగా ఉంటూ వస్తున్న యూపీలో ఈసారి ఆ పార్టీకి పరిస్థితులు అంత సానుకూలంగా ఏమీ లేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నాలుగో దశలో యూపీలోని 13 సీట్లకు పోలింగ్‌ జరిగితే.. ప్రత్యేకించి ఇందులో మూడు సీట్లు రాజకీయంగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి. గత ఎన్నికల్లో బీజేపీ ఈ అన్ని సీట్లనూ క్లీన్‌ స్వీప్‌ చేసింది. సిటింగ్‌ ఎంపీలపై విశ్వాసంతో ఇక్కడ రెండు సీట్లలో మినహా మిగిలిన అన్నింటిలో పాతవారికే మళ్లీ అవకాశం ఇచ్చింది.

శివ్‌పాల్‌ యాదవ్‌ తిరిగి పార్టీలోకి రావడంతో సమాజ్‌వాది పార్టీ ఈ ఎన్నికలపై గట్టి నమ్మకంతో ఉన్నది. రాజకీయంగా ఆసక్తి కలిగిస్తున్న నియోజకవర్గాల్లో సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ పోటీ చేస్తున్న కన్నౌజ్‌ ఒకటి. కన్నౌజ్‌ నుంచి పోటీచేయాలని అఖిలేశ్‌ ఆఖరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నారు. శక్తియుక్తులన్నీ కూడదీసుకుని సమాజ్‌వాది పార్టీ బీజేపీకి సవాలు విసురుతున్నదనేందుకు ఇదొక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

అఖిలేశ్‌కు ఇది వ్యక్తిగత ప్రతిష్ఠకు సంబంధించిన అంశం కూడా. గత ఎన్నికల్లో అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ బీజేపీ అభ్యర్థి సుబ్రత్‌ పాఠక్‌ చేతిలో ఓడిపోయారు. మళ్లీ పాఠక్‌ ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా ఉన్నారు. ఇటీవల కన్నౌజ్‌లో నిర్వహించిన బహిరంగ సభకు కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ కూడా హాజరయ్యారు. తాను విజయం సాధించేందుకు కేవలం తనకున్న ప్రజాదరణపైనే అఖిలేశ్‌ ఆధారపడటం లేదనేందుకు ఇదొక నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

మరో నియోజకవర్గం లఖింపూర్‌ ఖేరీ. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా థేని మరోసారి ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. 2021లో నలుగురు రైతులు, ఒక పాత్రికేయుడిపైకి కారు నడిపించిన కేసులో థేని కుమారుడు ఉన్నాడు. ఆ ఘటన మరుగునపడిపోయిందనుకున్నా.. దాని ప్రభావం ఓటర్లపై తప్పకుండా చూపిస్తుందని చెబుతున్నారు.

మరో సీటు.. ఉన్నావో. ఇక్కడ బీజేపీ నుంచి సాక్షి మహరాజ్‌ పోటీ చేస్తున్నారు. గతంలో కాంగ్రెస్‌ తరఫున ఎంపీగా గెలిచిన అను టాండన్‌ ఆయనకు ప్రత్యర్థిగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా టాండన్‌కు పెద్ద ఎత్తున జనాదరణ ఉన్నది. ఓటమిపాలైనా.. ఆమె నియోజకవర్గంలో ప్రజల్లో నిత్యం అందుబాటులో ఉన్నారన్న ప్రఖ్యాతి పొందారు.
యూపీలో మరో కీలక సీటు బహరాయిచ్‌. ఇక్కడ ముస్లిం ఓట్లు గణనీయంగా ఉంటుంది. ఇది బీజేపీ అభ్యర్థికి మైనస్‌ పాయింట్ అవనుండగా.. ఇండియా కూటమికి కలిసొచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఎటావాలో బీజేపీ అభ్యర్థిగా రామ్‌శంకర్‌ కథారియా పోటీ చేస్తున్నారు. వాస్తవానికి ఆయన ఈ నియోజకవర్గానికి వెలుపలి వ్యక్తి. ఆయనది ఆగ్రా. ఆయనకు టికెట్‌ ఇవ్వడంపై స్థానిక బీజేపీ నేతల్లోనే అసంతృప్తి ఉన్నదని సమాచారం. ఇది ఆయనకు మరో పెద్ద సవాలుగా పరిణమించిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

గతంలో యూపీలో ఒక వెలుగు వెలిగిన బీఎస్పీ.. ఇప్పుడు రాజకీయంగా కష్టకాలం ఎదుర్కొంటున్నది. అయినప్పటికీ.. షాజహాన్‌పూర్‌, హర్దోయి, మిశ్రిఖ్‌, బ్రహాయిచ్‌లలో ఎస్పీకి కొంత ఇబ్బంది కలిగించే అవకాశం ఉందని అంటున్నారు. గత ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు మహాఘట్‌బంధన్‌ పేరిట కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిస్థితుల్లో నాలుగో దశ బీజేపీ అంత సానుకూలం ఏమీ కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Latest News