Site icon vidhaatha

Waqf Amendment) Bill | సంయుక్త పార్లమెంటరీ ప్యానెల్‌కు వక్ఫ్‌ బిల్లు

ప్రతిపక్షాల నిరసనల మధ్య వక్ఫ్‌ (సవరణ) బిల్లు 2024(Waqf (Amendment) Bill 2024 )ను కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు, వాడీవేడీ చర్చల అనంతరం, ఈ బిల్లును మరింత లోతుగా అధ్యయనం చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ(Joint Parliamentary Committee)కి పంపిస్తున్నట్లుగా స్పీకర్‌ ఓం బిర్లా(Om Birla) ప్రకటించారు.

సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టేందుకు కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు(Kiran Rijiju) సిద్ధమవుతుండగా.. ప్రతిపక్ష ఇండియా(INDIA alliance) కూటమి సభ్యులు తీవ్రంగా నిరసించారు. ముస్లింలను టార్గెట్ చేసుకునేందుకు, రాజ్యాంగంపై దాడి చేసేందుకే ఈ బిల్లును ఉద్దేశించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లు ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ నోటీసు ఇచ్చిన కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్‌, మత స్వేచ్ఛ హక్కును కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘిస్తున్నదని ఆరోపించారు. ఈ క్రమంలోనే రాబోయే మహారాష్ట్ర వంటి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల(Upcoming Assembly Elections)ను దృష్టిలో ఉంచుకుని ఈ బిల్లు తీసుకొచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇది మత స్వేచ్ఛపై నేరుగా దాడి చేయడమే. తర్వాత మీరు క్రైస్తవులపై, ఆ తర్వాత జైనులపై దాడి చేస్తారు’ అని అన్నారు. కరడుగట్టిన బీజేపీ మద్దతుదారులను బుజ్జగించేందుకే ఈ బిల్లు తీసుకొచ్చారని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌(Akhilesh Yadav) విమర్శించారు. ఇతర మత సంస్థల్లో అన్యమతస్తులను నియమించరని, కానీ వక్ఫ్‌ బోర్డు(WAQF Board)లలో ముస్లిమేతరులను నియమించడంలో ఉద్దేశం ఏమిటని నిలదీశారు. ‘బీజేపీ తన కరడుగట్టిన మద్దతుదారులను బుజ్జగించేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారనేది వాస్తవం’ అని ఆయన అన్నారు.

ఈ సవరణ చేయడానికి ఈ సభకు అధికారం లేదని ఆలిండియా మజ్లిస్‌ ఇత్తెహాదుల్‌ ముస్లిమీన్‌ (AIMIM) అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ(Asaduddin Owaisi) అన్నారు. ఈ బిల్లు న్యాయ స్వాతంత్ర్యం, అధికారాల వికేంద్రీకరణ మూల సిద్ధాంతాలనే ఉల్లంఘిస్తున్నదని, ఇది రాజ్యాంగం పునాదులపై దాడి చేయడమేనని విమర్శించారు. ‘మీరు ముస్లిం వ్యతిరేకులు.. అందుకు ఈ బిల్లే సాక్ష్యం’ అని ఆయన చెప్పారు.  ఒక నిర్దిష్ట మతానికి వ్యతిరేకంగా ఉన్నందున ఈ బిల్లును తాము తిరస్కరిస్తున్నామని ఎన్సీపీ (శరద్‌పవార్‌) ఎంపీ సుప్రియా సూలె(Supriya Sule) తెలిపారు.  ‘ఈ బిల్లును ఉపసంహరించుకోవాలి. దీనిపై చర్చించాలి. న్యాయమైన, నిష్పాక్షికమైన బిల్లును తీసుకురావాలి’ అని ఆమె డిమాండ్‌ చేశారు.

వక్ఫ్‌ (సవరణ) 2024 బిల్లును కిరణ్‌ రిజిజు గట్టిగా సమర్థించుకున్నారు. 1995 నాటి వక్ఫ్‌ చట్టం(WAQF Act-1995) దాని ఉద్దేశాలను నెరవేర్చడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన సంస్కరణలు చేయకపోవడంతో దానిలో సవరణలు అనివార్యమయ్యాయని అన్నారు. ‘కొంతమంది వక్ఫ్‌ బోర్డులను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సాధారణ ముస్లింలకు న్యాయం చేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చాం’ అని ఆయన తెలిపారు. వక్ఫ్‌ బోర్డులు మాఫియా(WAQF Boards turns Mafia)గా మారిపోయాయని తనతో పలువురు ప్రతిపక్ష సభ్యులు ఆంతరంగిక సంభాషణల్లో చెప్పారని వెల్లడించారు. వారి పేర్లు బయటపెట్టి, వారి రాజకీయ భవిష్యత్తును నాశనం చేయదల్చుకోలేదని వ్యాఖ్యానించారు.

గతంలో ఉన్న చట్టంలో ట్రిబ్యునల్‌ తీర్పు లేదా ఆదేశాలను సవాలు చేసేందుకు లేదా సమీక్షించేందుకు అవకాశం లేదని రిజిజు తెలిపారు. ఇప్పుడు వాటిని హైకోర్టుల్లో సవాలు చేసేందుకు అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. మన దేశంలో ఏ చట్టం కూడా సూపర్‌ చట్టంగా ఉండజాలదని, రాజ్యాంగానికంటే ఎగువన ఉండదని అన్నారు. అయితే.. 1995 నాటి వక్ఫ్‌ చట్టంలో రాజ్యాంగాన్ని మించిన సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. వాటిని మార్చకూడదా? అని నిలదీశారు. అన్ని స్థాయిల్లో ఈ బిల్లుపై సమగ్రంగా చర్చించినట్లు మంత్రి చెప్పారు. తమిళనాడు(Tamilnadu)లో ఒక గ్రామం మొత్తాన్ని వక్ఫ్‌ భూమి(WAQF Land)గా ప్రకటించారని  పేర్కొన్నారు. అందుకే ఈ చట్టంలో సవరణలు చేస్తున్నామని తెలిపారు. వక్ఫ్‌ బోర్డు ఆదాయం(WAQF Board income) ముస్లిం సమాజం సంక్షేమానికే ఉపయోగిస్తామని ఆయన హామీ ఇచ్చారు.  ఒక ముస్లిమేతరుడిగా ముస్లింల సంక్షేమం కోసం బిల్లు ప్రవేశపెట్టే అవకాశం రావడం తన అదృష్టమని కిరణ్‌ రిజిజు చెప్పుకొన్నారు.

1995 వక్ఫ్‌ చట్టాన్ని సవరించేందుకు ఉద్దేశించిన బిల్లును ఎన్డీయే పక్షాలైన జేడీయూ, టీడీపీ, శివసేన, ఎల్జేపీ సమర్థించాయి. ఈ సవరణలు వక్ఫ్‌ బోర్డుల్లో పారదర్శకత(Transparency)ను తీసుకొస్తాయని కొనియాడాయి. ఇది మసీదుల నిర్వహణలో జోక్యం చేసుకోవడానికి కాదని పేర్కొన్నాయి.

 

Exit mobile version