Site icon vidhaatha

Viral Video | పిలిచి.. దండేసి మరీ చితకబాదారు! యూపీలో ఘటన వీడియో వైరల్‌

Viral Video | అప్పుడప్పుడు కొందరు రాజకీయ నాయకులకు చేదు అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. వారి వ్యవహారాలను వ్యతిరేకించేవారు, విధానాలను నిరసించేవారు, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేసేవారు.. వేర్వేరు చర్యలకు పాల్పడుతూ ఉంటారు. కొందరు ఇంకు చల్లుతారు.. కొందరు చెప్పులు విసిరేస్తుంటారు. మరికొందరైతే ఏకంగా చెంప ఛెళ్లుమనిపిస్తుంటారు. ఇటువంటి అన్ని సందర్భాలూ మన అవగాహనలో ఉన్నవే. కానీ.. గౌరవంగా ఒక గుడికి పిలిచి.. మర్యాదగా దండ వేసి.. ఆ తర్వాత చితకబాదిన సంఘటన చూశారా? ఇప్పుడు మీరు చదివేది దాని గురించే. హై వోల్టేజ్‌ రాజకీయాలకు పెట్టింది పేరైన ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన చోటు చేసుకున్నది. యూపీకి చెందిన ఎమ్మెల్యే మహేంద్ర రాజభర్‌ అనే నాయకుడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఆయన సుహెల్దేవ్‌ స్వాభిమాన్‌ పార్టీకి నాయకుడు. గతంలో ఓపీ రాజ్‌భర్‌ నేతృత్వంలోని సుహుల్దేవ్‌ భారతీయ సమాజ్‌ పార్టీలో ఉండేవాడు.

మెడలో దండ వేసి..

ఆయనను ఒక బహిరంగ కార్యక్రమానికి ఆహ్వానించిన ఒక కార్యకర్త.. స్పీచ్‌ ఇచ్చి.. మర్యాదగా మెడలో దండ వేసి.. ఆ వెంటనే చితకబాదాడు. ‘రాజ్‌భర్‌ కమ్యూనిటీకి ఏదో మేలు చేస్తాడని మేం నిన్ను అసెంబ్లీకి, లోక్‌సభకు పంపించాం. కానీ.. దానికి బదులు.. సొంత కుటుంబం కోసం పనిచేస్తున్నావు. సమాజాన్ని చాలా మంది నాయకులు మోసం చేస్తూ దోచుకుంటున్నారు’ అని ఆ వైరల్‌ వీడియోలో బ్రిజేశ్‌ రాజ్‌భర్‌ అనే వ్యక్తి మాట్లాడటం వినిపిస్తున్నది. ఈ ఘటనతో నివ్వెర పోయిన మహేంద్ర రాజ్‌భర్‌ పార్టీ కార్యకర్తపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్‌బీఎస్‌ చీఫ్‌ ఓం ప్రకాశ్‌ రాజ్‌భర్‌ కుట్రతోనే తనపై ఈ దాడి జరిగిందని ఆరోపించాడు.

దాడిని ఖండించిన అఖిలేశ్‌

ఈ దాడి ఘటనను సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ ఖండించారు. బీజేపీ పాలనలో అణగారిన, దళిత, మైనార్టీలపై దాడిగా దీనిని ఆయన అభివర్ణించారు. ఈ దాడి వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఎవరీ మహేంద్ర రాజ్‌భర్‌..

ఎస్‌బీఎస్‌పీకి ఒకప్పుడు జాతీయ ఉపాధ్యక్షుడిగా మహేంద్ర రాజ్‌భర్‌ పనిచేశారు. 2017లో యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకప్పుడు గ్యాంగ్‌ స్టర్‌గా ఉండి.. తర్వాత రాజకీయ నాయకుడి అవతారం ఎత్తిన ముక్తార్‌ అన్సారీపై బీజేపీ, ఎస్‌ఎస్‌బీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. పార్టీ చీఫ్‌ ఓపీ రాజ్‌భర్‌తో పొసగడం లేదంటూ సుహుల్దేవ్‌ స్వాభిమాన్‌ పార్టీ నుంచి 2019లో బయటకు వచ్చేశారు. కమ్యూనిటీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాల కోసం ఆయన పనిచేస్తున్నారని అప్పట్లో విమర్శలు గుప్పించారు. సమాజ్‌వాది పార్టీ పొత్తుతో 2022 అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు.

Exit mobile version