MP couple | ఎంపీలుగా ఎన్నికైన ఇద్దరాలుమగలు.. లోక్‌సభలో ఏకైక ఎంపీల జంట వీరిదే.. ఆ కుటుంబం నుంచే మరో ముగ్గురు..!

MP couple | ఓ చట్టసభకు ఇద్దరాలుమగలు సభ్యులుగా ఎన్నిక కావడం అనేది అత్యంత అరుదు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్‌లు దక్కకపోవచ్చు. ఒకవేళ దక్కినా ఆ రెండు టికెట్‌లు ఇద్దరాలుమగలకే ఇవ్వకపోవచ్చు. ఒకవేళ పార్టీయే తమ సొంతమై ఇద్దరాలుమగలు పోటీచేసినా ఇద్దరూ గెలువడం జరగకపోవచ్చు. కానీ ఈసారి 18వ లోక్‌సభలో మాత్రం ఇద్దరాలుమగలు అడుగుపెట్టబోతున్నారు.

  • Publish Date - June 11, 2024 / 08:34 AM IST

MP couple : ఓ చట్టసభకు ఇద్దరాలుమగలు సభ్యులుగా ఎన్నిక కావడం అనేది అత్యంత అరుదు. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఇద్దరికి టికెట్‌లు దక్కకపోవచ్చు. ఒకవేళ దక్కినా ఆ రెండు టికెట్‌లు ఇద్దరాలుమగలకే ఇవ్వకపోవచ్చు. ఒకవేళ పార్టీయే తమ సొంతమై ఇద్దరాలుమగలు పోటీచేసినా ఇద్దరూ గెలువడం జరగకపోవచ్చు. కానీ ఈసారి 18వ లోక్‌సభలో మాత్రం ఇద్దరాలుమగలు అడుగుపెట్టబోతున్నారు. వాళ్లే సమాజ్‌వాది పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌, ఆయన సతీమణి డింపుల్‌ యాదవ్‌. కొత్తగా కొలువుదీరబోతున్న లోక్‌సభలో అడుడుపెట్టబోతున్న ఏకైక దంపతులు వీరే.

అఖిలేష్ యాదవ్, ఆయన భార్య డింపుల్ యాదవ్ ఒకేసారి లోక్‌సభకు ఎన్నికవడం ఇదే తొలిసారి. అఖిలేష్ తన సంప్రదాయ స్థానమైన కన్నౌజ్ నుంచి ఎంపీగా ఎన్నిక కాగా.. డింపుల్ యాదవ్ మెయిన్‌పురి స్థానం నుంచి ఎంపీగా గెలిచారు. ఈ ఎన్నికల్లో వీరిద్దరూ రికార్డు స్థాయి ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఎస్పీ నుంచి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలుపొందిన ఎంపీల్లో డింపుల్ యాదవ్ అగ్రస్థానంలో ఉండగా.. తర్వాత స్థానంలో ఆమె భర్త అఖిలేష్ యాదవ్ ఉన్నారు.

లోక్‌సభ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ఇద్దరూ సభలో కూర్చున్నప్పుడు అందరి దృష్టి వీరిపైనే నిలువనుంది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్ అజామ్‌గఢ్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అదే సమయంలో డింపుల్ యాదవ్ కన్నౌజ్ నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. అయితే ఎస్పీ వ్యవస్థాపకులు ములాయం సింగ్ యాదవ్ మరణంతో మెయిన్‌పురి సీటు ఖాళీ అయ్యింది. అప్పుడు అక్కడ జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్‌ విజయం సాధించి లోక్‌సభలో అడుగుపెట్టారు.

అఖిలేష్ యాదవ్ తొలిసారిగా తన భార్యతోపాటు లోక్‌సభకు రాబోతున్నారు. అఖిలేష్‌ దంపతులతోపాటు అఖిలేష్‌ ముగ్గురు సోదరులు కూడా ఎంపీలుగా ఈసారి సభకు రానున్నారు. కన్నౌజ్ నుంచి అఖిలేష్ యాదవ్, మెయిన్‌పురి నుంచి డింపుల్ యాదవ్ విజయం సాధించగా.. అజాంగఢ్ నుంచి ధర్మేంద్ర యాదవ్, ఫిరోజాబాద్ నుంచి అక్షయ్ యాదవ్, బదౌన్ నుంచి ఆదిత్య యాదవ్‌లు ఎంపీలుగా ఎన్నికయ్యారు. ఈ విధంగా ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఎంపీలుగా లోక్‌సభలోకి అడుగుపెట్టడం మరో రికార్డుగా చెప్పవచ్చు.

Latest News