ప్రకటించిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి
వరుసగా ఏడోసారి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్న నిర్మలమ్మ
న్యూఢిల్లీ : కేంద్రంలో కొత్త సర్కార్ కొలువుదీరిన సంగతి తెలిసిందే. జూన్ 24న ప్రారంభమైన 18వ లోక్‌సభలో ఎంపీలందరూ ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌సభ స్పీకర్‌గా మళ్లీ ఓం బిర్లానే ఎన్నికయ్యారు. ఇక 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది.
దీంతో ఈ నెల 22 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ ఎన్నికల ముందు 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఇప్పుడు పూర్తి స్థాయి పద్దుని ప్రకటించనున్నారు. ఈ మేరకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. జులై 23వ తేదీన కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు ఆమోదం లభించిందని కిరణ్ రిజిజు తెలిపారు. ఈ బడ్జెట్ సమావేశాలు ఆగస్టు 12వ తేదీ వరకు కొనసాగనున్నాయి.
సరికొత్త చరిత్ర సృష్టించబోతున్న నిర్మల సీతారామన్
మోదీ కేబినెట్‌లో వరుసగా రెండోసారి నిర్మలమ్మను ఆర్థిక మంత్రి పదవి వరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా 18వ లోక్‌సభలో ఆర్థిక మంత్రిగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు. అయితే, వరుసగా ఆరుసార్లు బడ్జెట్‌లను సమర్పించిన మాజీ ఆర్థిక మంత్రి మొరార్జీ దేశాయ్ రికార్డును ఆమె బ్రేక్ చేయబోతున్నారు. ఈసారి కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ 2024-25 బడ్జెట్‌ను ప్రవేశపెడితే.. వరుసగా ఏడు కేంద్ర బడ్జెట్‌లను సమర్పించిన ఆర్థిక మంత్రిగా ఆమె సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు.
2014 నుంచి కేబినెట్‌లో..
కాగా, 2014లో మోదీ తొలి విడుత మంత్రి వర్గంలో పరిశ్రమలు, వాణిజ్యశాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో కీలకమైన రక్షణ శాఖ బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2019లో రెండోసారి ప్రధాని మోదీ ఎన్నికైన తర్వాత ఏర్పాటైన కేంద్ర మంత్రి వర్గంలోనూ చోటు దక్కించుకున్న నిర్మలా సీతారామన్‌కు అత్యంత కీలకమైన ఆర్థికశాఖ ఆమెను వరించింది. కేంద్ర మంత్రివర్గంలో మూడోసారి వరుసగా చోటు దక్కించుకున్న ఏకైక మహిళా నాయకురాలిగా నిర్మలా సీతారామన్ రికార్డు నెలకొల్పారు.