విధాత, హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర క్యాబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బుధవారం నిర్వహించిన మంత్రివర్గం సమావేశంలో ఒకేసారి నాలుగు కీలకఅంశాలకు ఆమోదం తెలిపింది. ఇందులో ప్రధానంగా దేశంలోని అరుదైన భూమి అయస్కాంత దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి రూ.7,280 కోట్ల బడ్జెట్ తో అరుదైన భూమి శాశ్వత మాగ్నెట్ (REPM) పథకాన్ని మంత్రివర్గం ఆమోదించింది.
అలాగే, మహారాష్ట్ర-గుజరాత్ ప్రజలకు ప్రత్యేక బహుమతులు సహా మొత్తం రూ.19,919 కోట్ల విలువైన ప్రాజెక్టులకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు. ముంబై సమీపంలోని బద్దాపర్-కర్జాత్ లైన్, గుజరాత్ లోని ద్వారకా రైల్వే లైన్ల నిర్మాణానికి ఓకే చెప్పింది. పూణే మెట్రోకు రూ.9,858 కోట్ల గ్రాంట్ అందించడానికి కేంద్రం నిర్ణయించింది. 32 కిలోమీటర్ల కొత్త లైన్ వేయడానికి వీలు కల్పించింది. గుజరాత్ యాత్రికుల కోసం ఓఖా నుంచి కనాలస్ రైల్వే లైన్ ను డబుల్ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టుకు రూ.1,457 కోట్లు ఖర్చు కానుంది.
కాగా, అరుదైన భూమి శాశ్వత మాగ్నెట్ ను ప్రముఖ ఇండస్ట్రీల్లో వినియోగించనున్నారు. ఇందులో ఎలక్ట్రిక్ వెహికిల్స్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్ వస్తువులు, మెడికల్ పరికరాలు, భద్రత దళాలు ప్రధాన రంగాలుగా ఉన్నాయి. రేర్ ఎర్త్స్ పథకం (REPM) దేశ సాంకేతికతకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని.. ఈ ప్రాజెక్టులు సకాలంలో పూర్తవుతాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
