Adani | అదానీకి యూఎస్ ఎస్ఈసీ స‌మ‌న్లు.. ఆరు నెల‌లు గ‌డిచినా అందించ‌ని భార‌త్

Adani | ఫెడ‌ర‌ల్ సెక్యూరిటీ ఉల్లంఘ‌న‌ల కేసులో భార‌తీయ పారిశ్రామిక‌వేత్త గౌతమ్ అదానీ, ఆయ‌న మేన‌ల్లుడు సాగ‌ర్ అదానీకి గ‌తేడాది యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ క‌మిష‌న్ స‌మ‌న్లు జారీ చేసింది.

Adani | ఫెడ‌ర‌ల్ సెక్యూరిటీ ఉల్లంఘ‌న‌ల కేసులో భార‌తీయ పారిశ్రామిక‌వేత్త గౌతమ్ అదానీ, ఆయ‌న మేన‌ల్లుడు సాగ‌ర్ అదానీకి గ‌తేడాది యునైటెడ్ స్టేట్స్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ క‌మిష‌న్ స‌మ‌న్లు జారీ చేసింది. ఇందుకు భార‌త్ స‌హాయాన్ని అమెరికా కోరింది. కానీ స‌మ‌న్లు జారీ చేసి ఆరు నెల‌లు గ‌డుస్తున్నా ఇప్ప‌టి వ‌ర‌కు అదానీకి, ఆయ‌న మేన‌ల్లుడుకు భార‌త్ నోటీసులు అందించ‌లేద‌ని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ క‌మిష‌న్ న్యూయార్కులోని ఈస్ట్ర‌ర్న్ డిస్ట్రిక్ట్ కోర్టుకు ఆగ‌స్టు 11వ తేదీన తెలిపింది.

2020- 2024 మధ్య సోలార్ ఎన‌ర్జీ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా ద్వారా సౌర విద్యుత్ కాంట్రాక్టులను పొందేందుకు గౌతమ్ అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ మాజీ సీఈఓ వనీత్ జైన్, భారత పునరుత్పాదక ఇంధన సంస్థ అజూర్ పవర్‌కు సంబంధించిన ఇద్దరు మాజీ అధికారులు, కెనడియన్ పెన్షన్ ఫండ్ కైస్సే డీ డీపోట్ ఎట్ ప్లేస్‌మెంట్ డూ క్యూబెక్ (సీడీపీక్యూ) ముగ్గురు మాజీ అధికారులు భారత ప్రభుత్వ అధికారులకు రూ. 2,029 కోట్ల‌కు పైగా లంచం చెల్లించారని యూఎస్‌ న్యాయ శాఖ ఆరోపించింది.

అయితే భారతదేశంలోని అదానీకి సమన్లు, ఫిర్యాదు లేఖలను అందించడానికి హేగ్ కన్వెన్షన్ ఆర్టికల్ 5(ఏ) కింద భారత న్యాయ మంత్రిత్వ శాఖ నుంచి సహాయం కోరినట్లు ఎస్‌ఈసీ తెలిపింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆ స‌మ‌న్ల‌ను అదానీకి అందించ‌లేద‌ని తెలుస్తుంద‌ని ఎస్ఈసీ పేర్కొంది.

అభియోగపత్రం ప్రకారం.. అప్పటి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో సహా ఆంధ్రప్రదేశ్‌లోని అధికారులకు లంచం ఇవ్వడానికి అజూర్ పవర్‌తో కుమ్మక్కయ్యారు. అలాగే విద్యుత్ అమ్మకాల ఒప్పందాలను పొందేందుకు మహారాష్ట్ర, కేరళ, బీహార్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, ఒడిశా, జమ్మూక‌శ్మీర్ అధికారులతో సమావేశాలు కూడా జరిగాయని పేర్కొంది.

అదానీ గ్రూప్, జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి తాము ఎటువంటి తప్పు చేయలేదని ఖండించారు. అయితే భారత న్యాయ మంత్రిత్వ శాఖ‌తో క‌మ్యూనికేట్ అవుతూనే ఉంటామ‌ని, హేగ్ స‌ర్వీస్ క‌న్వెన్ష‌న్ ద్వారా ప్ర‌తివాదుల సేవ‌ను కొన‌సాగిస్తామ‌ని ఎస్ఈసీ తెలిపింది.