Site icon vidhaatha

US stock market : ట్రంప్ నోట ఒక్క మాటతో US స్టాక్ మార్కెట్లలో 1.7 ట్రిలియన్ డాలర్ల పతనం

US stock market : ట్రంప్ ఒక్కొక్క ఆదేశం, ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం నేడు యావత్తు ప్రపంచాన్ని అతలాకూతలం చేస్తున్న పరిస్థితి తెల్సిందే. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన జనవరి 20 నుండి నేటి వరకు గడిచిన కాలంలో పరిస్థితి ఇదే! కానీ నిన్న 70వ రోజున హఠాత్తుగా అమెరికా స్టాక్ మార్కెట్లని కూడా అతలాకుతలం చేసింది. అందుకు ట్రంప్ ఆదేశం కారణం కాదు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం కారణం కాదు. కేవలం ఒక్క ట్రంప్ నోటి మాట కారణం.

అమెరికా ఆర్ధిక వ్యవస్థ 2025 లో సంక్షోభంలో పడుతుందనే ఆర్ధిక పండితుల జోస్యం పై ప్రశ్నకు సమాధానంగా దానిని త్రోసిపుచ్చలేనని ట్రంప్ వ్యాఖ్యానించాడు. ఈ ఒక్క మాటతో నిన్న సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్లు ఘోరంగా కుప్పకూలాయి. 1.7 ట్రిలియన్ డాలర్ల పతనం జరిగింది. అది భారతదేశ వార్షిక జీడీపీ లో దాదాపు సగం. దానిని భారతదేశ రూపాయల్లో 1.7 ని లక్ష కోట్లతో గుణించాలి. వచ్చే సంఖ్యను తిరిగి 87 తో గుణించాలి.

స్టాక్ మార్కెట్ల సంపద భౌతిక సంపద కాదు. అది నికర విలువ కాదు. ఐనా పెట్టుబడిదారీ వ్యవస్థకు అది ఆక్సిజెన్ వంటిది. ఈ జూదగొండి ఆర్ధిక విధానం దానికి ఊపిరి. మనకు BSE, NSE ల వలే అమెరికాలో S&P 500, నాస్ డాక్ 100 సూచీలున్నాయి. అవి 2022 సెప్టెంబర్ తర్వాత దిగువకు దిగజారాయి. మోడీకి ఆదానీ వలేనే ట్రంప్ కి ఎలాన్ మాస్క్ అని తెల్సిందే. ఆయన ఎలక్ట్రిక్ వాహనాల కంపెనీ TESLA స్టాక్స్ ఆ సగటు నష్టం కంటే కూడా ఘోరంగా పడిపోయాయి. అమెరికా స్టాక్ మార్కెట్ల పీక్ 19-2-2019 తర్వాత తొమ్మిది శాతం పతనం కావడం గమనార్హం.

నిన్న సోమవారం అమెరికా స్టాక్ మార్కెట్ల వ్యవస్థలో దుర్డినం. అది బాడ్ మండే మాత్రమే కాకుండా బ్లాక్ మండేగా, బ్లడీ మండేగా కూడా మారింది. ఇంతకూ 2025 లో రానున్నది 2008 ఆర్ధిక సంక్షోభమా? లేదా 1929 మహా మాంద్యమా?

వేచి చూద్దాం.

పి ప్రసాద్ (పిపి)
11-3-2025

Exit mobile version