Site icon vidhaatha

Vijender Singh | వినేశ్‌మీద భారీ కుట్ర! అనర్హతపై బాక్సర్‌ విజేందర్‌ ఏమంటున్నాడు? ప్రధాని సందేశమేంటి?

న్యూఢిల్లీ : మహిళా రెజ్లర్‌ వినేశ్‌ ఫొగట్‌ మీద, భారతదేశం మీద భారీ కుట్ర జరిగిందని బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ సంచనల ఆరోపణలు చేశాడు. ఇండియా టుడేతో ఆయన మాట్లాడుతూ.. ‘భారత్‌, భారత రెజ్లర్లపై ఇది భారీ కుట్ర. అంతకు ముంద ఆమె ప్రదర్శన అద్భుతమైనది. ఆ సంతోషాన్ని కొందరు జీర్ణించుకోలేక పోయారేమో. ఒక రాత్రిలో ఐదు నుంచి ఆరు కిలోల బరువు తగ్గొచ్చు. కానీ.. వంద గ్రాములకేమైంది? కొందరికి కొన్ని సమస్యలు ఉండొచ్చని నేను భావిస్తున్నా.

అందుకే ఆమెపై అనర్హత వేటు పడింది. ఆ వంద గ్రాములు కూడా బరువు తగ్గేందుకు ఆమెకు అవకాశం కల్పించి ఉండాల్సింది’ అని అతడు చెప్పాడు. ‘ఒలింపిక్స్‌లో నేనూ పాల్గొన్నా. ఇలాంటిది ఎన్నడూ చూడలేదు’ అని 2008 ఒలింపిక్స్‌ బాక్సింగ్‌లో కాంస్య పతక విజేత అన్నాడు. రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా మాజీ అధ్యక్షుడు మహిళా బాక్సర్లపై లైంగిక వేధింపులకు పాల్పడారంటూ వినేశ్‌ ఫొగట్‌, సాక్షిమాలిక్‌, బజరంగ్‌ పునియా వంటి రెజ్లర్లు పెద్ద ఎత్తున పోరాటం చేసిన విషయం తెలిసిందే.

వెల్లువెత్తిన మద్దతు

అనర్హత వేటుకు గురైన వినేశ్‌ ఫొగట్‌కు ఈ క్లిష్ట పరిస్థితిలో యావత్‌ దేశం అండగా నిలిచింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా మొదలుకుని ప్రతిపక్ష నేతలు, పీవీ సింధు తదితర క్రీడాకారులు ఆమెకు సంఘీభావం ప్రకటించారు. ‘వినేశ్‌.. నువ్వు చాంపియన్లలో చాంపియన్‌. భారతదేశానికి నువ్వు గర్వకారణం. ప్రతి భారతీయుడికి నువ్వు స్ఫూర్తిప్రదాతవు. ఈ రోజు ఎదురుదెబ్బ బాధిస్తున్నది. దృఢత్వానికి నువ్వు ప్రతిబింబం అని నాకు తెలుసు. సవాళ్లను తీసుకుని ముందుకు సాగిపోవడం నీ సహజ స్వభావం. బలంగా తిరిగిరా. నీకు అండగా మేమంతా ఉన్నాం’ అని ప్రధాని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.

లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన

వినేశ్‌ ఫొగట్‌పై అనర్హతవేటు పడటంపై ప్రతిపక్ష పార్టీలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఇందులో కుట్ర కోణం దాగి ఉందన్న అనుమానాలను వ్యక్తం చేశాయి. గత కొంతకాలం క్రితం వినేశ్‌ ఫొగట్‌, సాక్షిమాలిక్‌, బజరంగ్‌ పునియా వంటి రెజ్లర్లు నాటి రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌పై పెద్ద ఎత్తున న్యాయ పోరాటం చేసిన విషయం తెలిసిందే. పలువరు మహిళా రెజ్లర్లను ఆయన లైంగిక వేధింపులకు గురిచేశాడని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్రం ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరించడంపై వారు వీధిపోరాటాలకు సైతం దిగిన సంగతి తెలిసిందే.

వినేశ్‌ ఫొగట్‌పై అనర్హత వేటు నిర్ణయంపై పునఃసమీక్షించాలని ఇంటర్నేషనల్‌ ఒలింపిక్‌ సంఘాన్ని కోరాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేశాయి. బుధవారం ఉభయ సభల్లో ప్రతిపక్ష నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ ఈ అంశాన్ని లేవనెత్తారు. వినేశ్‌ ఫొగట్‌కు తమ సంఘీభావం ప్రకటించారు. ఫొగట్‌ అనర్హత వెనుక కుట్ర ఉండొచ్చన్న అనుమానాన్ని పలువురు ఎంపీలు వ్యక్తం చేశారు. ఫొగట్‌కు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ పార్లమెంటు ప్రాంగణంలో ధర్నా చేశారు. వాస్తవంగా ఏం జరిగిందో ప్రభుత్వం తెలియజేయాలని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ డిమాండ్‌ చేశారు. ఫొగట్‌పై కుట్ర జరిగి ఉంటుందని కాంగ్రెస్‌ ఎంపీ  రణ్‌దీప్‌  సుర్జేవాలా ఆరోపించారు. ఫొగట్‌పై అనర్హతవేటు పడటంపై సమగ్ర దర్యాప్తు చేయించాలని సమాజ్‌వాది పార్టీ ఎంపీ అఖిలేశ్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఇది నమ్మశక్యం కాకుండా ఉన్నదని, ఇందులో కుట్ర కోణాన్ని ప్రతిపక్షం అనుమానిస్తున్నదని జేఎంఎం ఎంపీ మహువా మాజీ అన్నారు.

కుట్రలు కచ్చితంగా విచ్ఛిన్నమవుతాయి : రణ్‌దీప్‌ సుర్జేవాలా

‘ఇది భారీ కుట్ర. మొదట బీజేపీ ఎంపీ, రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ నాటి అధ్యక్షుడు, మోదీజీ ఫేవరెట్‌ బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌సింగ్‌ ప్రపంచ ఛాంపియన్‌ అయిన మన బిడ్డను మానసికంగా, శారీరకంగా హింసించాడు. ఆ తర్వాత జంతర్‌మంతర్‌ వద్ద పోలీసులు వీధిలోకి లాగిన మన బిడ్డను బీజేపీ వాళ్లు టార్గెట్‌ చేసుకున్నారు. ఆ తర్వాత మోదీ ప్రభుత్వం మన బిడ్డపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలు చేసింది. అయినా వినేశ్‌ ఫొగట్‌ తెగువను, ధైర్యాన్ని, సహనాన్ని కోల్పోలేదు. పారిస్‌ ఒలింపిక్స్‌లో ఆమె ప్రపంచ అజేయ రెజ్లర్‌ యూయి సుసాకిని, మరో ఇద్దరు రెజ్లర్లను ఓడించి, త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసింది. కానీ.. ఇది కుట్రదారులకు సహించలేదు. వినేశ్‌ ఫొగట్‌ విజయం ఎవరికి జీర్ణం కాలేదు? మన హర్యానా బిడ్డకు, భారతదేశానికి ఎవరు వెన్నుపోటు పొడిచారు? ఎవరు అధికారాన్ని దుర్వినియోగం చేశారు? ఎవరి ముఖాన్ని కాపాడేందుకు ఈ ప్రయత్నం? హర్యానాలోని, భారతదేశంలోని ప్రతి బిడ్డ తన వెంట ఉన్నది. మాకు తను ఒలింపిక్‌ స్వర్ణ పతక విజేత. కుట్రలు కచ్చితంగా విచ్ఛిన్నమవుతాయి. అసలు ముఖాలు బయటకు వస్తాయి’ అని కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

Exit mobile version