Wayanad natural disaster | కేరళపై ప్రకృతి ప్రళయం.. విరిగిపడిన కొండచరియలు.. 100 మంది మృతి!

కేరళలోని వాయనాడ్‌లో మృత్యుఘోష వినిపిస్తున్నది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మంగళవారం తెల్లవారుజామున వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని పలుచోట్ల భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి.

  • Publish Date - July 30, 2024 / 07:25 PM IST

అనేకమంది గల్లంతు.. పెరగనున్న మృతుల సంఖ్య
సహాయ చర్యలకు వర్షం, భౌగోళిక సవాళ్లు
అనేక ప్రభావిత ప్రాంతాలకు చేరని సాయం

తిరువనంతపురం : కేరళలోని వాయనాడ్‌లో మృత్యుఘోష వినిపిస్తున్నది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా మంగళవారం తెల్లవారుజామున వాయనాడ్ జిల్లాలోని మెప్పాడి సమీపంలోని పలుచోట్ల భారీ ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. దాంతో పదుల సంఖ్యలో జనం కొండ చరియల కింద చిక్కుకుపోయారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (KSDMA), అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు (NDRF) ఘటనా ప్రాంతానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టాయి. తొలి గంటలోనే 7 మృతదేహాలను వెలికి తీశారు. 20 మందికిపైగా క్షతగాత్రులను వెలికి తీసి చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలించారు. ఆ తర్వాత కూడా కొండచరియలను తొలగించినా కొద్ది మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇప్పటి వరకూ వంద మంది వరకూ చనిపోయి ఉంటారని తెలుస్తున్నది. శిథిలాల ఇంకా చాలా మంది ఉన్నట్లు స్థానికులు చెబుతన్నారని, దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. ఘటనా ప్రాంతంలో వర్షం పడుతున్నప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సమీప ప్రాంతాల నుంచి అదనపు రిలీఫ్‌ బృందాలను కూడా వయనాడ్‌కు రప్పించారు. భారీగా వర్షం కురుస్తుండటంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బందిగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకూ 93 మృతదేహాలను వెలికి తీశామని ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ మీడియాకు తెలిపారు. మరో 128 మంది గాయపడ్డారని చెప్పారు. మృతుల్లో 34 మందిని గుర్తించామని, అందులో 18 మృతదేహాలను బంధువులకు అప్పగించామని తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఒకసారి, తిరిగి ఉదయం 4.30 గంటల సమయంలో మరోసారి కొండచరియలు విరిగిపడినట్టు ఆయన వివరించారు. ఫలితంగా వందల మంది శిథిలాల్లో చిక్కుకుపోయారని తెలిపారు. సహాయ చర్యల్లో 200 మంది సైనికులు కూడా పాల్గొంటున్నారని విజయన్‌ చెప్పారు. సహాయ బృందాలకు వైద్య బృందాలు సహకరిస్తున్నాయని తెలిపారు. వాయనాడ్‌లో 45 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసి, 3వేల మందికి ఆశ్రయం కల్పిస్తున్నట్టు చెప్పారు. పోలీసు జాగిలాలతో కూడా అన్వేషిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉండగా.. పినరయి విజయన్‌కు ఫోన్‌ చేసిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌.. సహాయ, పునరావాస చర్యల్లో తమ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. తమ రాష్ట్రం తరఫున 5 కోట్ల మేరకు సహాయం అందిస్తామని తెలిపారు. సహాయ చర్యల నిమిత్తం సీఎండీఆర్‌ఎఫ్‌కు కేరళ బ్యాంకు 50 లక్షలు విరాళం ఇచ్చిందని విజయన్‌ తెలిపారు. సిక్కిం ముఖ్యమంత్రి 2 కోట్ల విరాళం హామీ ఇచ్చారు. ఘోర ప్రకృతి విపత్తు నేపథ్యంలో రాష్ట్రంలో రెండు రోజులపాటు సంతాప దినాలుగా పాటించనున్నట్టు విజయన్‌ తెలిపారు.

సహాయ చర్యలకు ఇబ్బందులు

పరిస్థితి చాలా దారుణంగా ఉన్నదని కేరళ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ వీ వేణు చెప్పారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతం మూరుమూలన ఉండటం, జోరు వాన, ఆ ప్రాంత భౌగోళిక పరిస్థితుల రీత్యా సహాయ సిబ్బంది ఆ మొత్తం ప్రాంతంలో సహాయ చర్యలు చేపట్టడంలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకూ 70 మృతదేహాలను గుర్తించినట్టు వేణు చెప్పారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పోస్టుమార్టం పూర్తిచేసి, సంబంధీకులకు మృతదేహాలను అప్పగించే ప్రక్రియ కొనసాగుతున్నదని వేణు చెప్పారు. అయితే మరింత మంది గల్లంతయ్యారన్న వార్తల నేపథ్యంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. ప్రభావిత ప్రాంతాలను చేరుకునేందుకు సహాయ సిబ్బందికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆయన వివరించారు. ‘ఈ ప్రాంతం మారుమూలన ఉండటం ప్రధాన సమస్యగా ఉన్నదని వేణు తెలిపారు. ప్రభావిత ప్రాంతంలో చాలా వరకూ సహాయ సిబ్బంది ఇంకా చేరుకోని పరిస్థితి ఉన్నదని ఆయన వివరించారు. అతికష్టం మీద ఒక చిన్న బృందం నదిని దాటి వెళ్లగలిగిందని, కానీ, సహాయ చర్యల కోసం మరింత మందిని పంపాల్సి ఉన్నదని తెలిపారు. భారీ వర్షం కురుస్తుండటంతోపాటు.. రెడ్‌ అలర్ట్‌ జారీ అయి ఉన్న రీత్యా హెలికాప్టర్లను ఉపయోగించలేని పరిస్థితి నెలకొన్నదని చెప్పారు. ‘మంగళ, బుధవారాల్లో రెడ్‌ అలర్ట్‌ ఉన్నది. దీంతో వాయుమార్గాన సహాయ సామగ్రి పంపే పని వాయిదా వేశాం’ అని ఆయన పేర్కొన్నారు. ఉపరితల మార్గం నుంచే బాధితులను చేరుకుని, రక్షించాల్సి ఉన్నదని చెప్పారు. అయితే.. నదిలో ప్రవాహం ఉధృతంగా ఉండటం, వంతెన కూలిపోవడంతో నది దాటేందుకు ప్రయత్నాలు ముందుకు సాగడం లేదన్నారు. ఆర్మీ సహకారం కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు. పలు బృందాలు సహాయ చర్యల్లోకి దిగినట్టు ఎన్డీఆర్‌ఎఫ్‌ డిప్యూటీ కమాండెంట్‌ ఎస్‌ శంకర్‌ పాండియన్‌ తెలిపారు. ‘వాయనాడ్‌లోని పలు ప్రాంతాల్లో 3 బృందాలు ఉన్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయని వార్తలు వస్తున్న కోజికోడ్‌లో కూడా ఉన్నాయి. సహాయ చర్యలు కొనసాగించేందుకు మా శక్తిమేరకు ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రభావిత ప్రాంతం లోపలి ప్రాంతాలకు వెళ్లటానికి అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి’ అని ఆయన చెప్పారు.
సహాయ చర్యలను పర్యవేక్షించేందుకు, నష్టాన్ని స్వయంగా అంచనా వేసేందుకు కేరళ అటవీ శాఖ మంత్రి శశీంద్రన్‌ ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. అంతకు ముందు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ కేరళ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరిపారు. వాయనాడ్‌లో సహాయ చర్యల కోసం ఎయిర్‌ఫోర్స్‌ ఇప్పటికే ఒక ఎంఐ17, ఒక ఏఎల్‌హెచ్‌ ధృవ్‌ హెలికాప్టర్లను అందుబాటులో ఉంచింది.

ప్రధాని దిగ్భ్రాంతి

వాయనాడ్‌ ప్రకృతి విపత్తు నేపథ్యంలో ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఫోన్‌ చేశారు. ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. కేంద్రం తరఫున సాధ్యమైన మేరకు సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మృతుల కుటుంబాలకు తక్షణమే 2 లక్షల చొప్పున, గాయపడినవారికి 50వేల చొప్పున ప్రధాన మంత్రి నేషనల్‌ రిలీఫ్‌ ఫండ్‌ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ఘటనపై కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, కేసీ వేణుగోపాల్‌, కేరళ ఆరోగ్యమంత్రి వీణా జార్జ్‌ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.