Union Budget | న్యూఢిల్లీ : కేంద్ర బడ్జెట్‌ను ఈ నెల 23వ తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నారు. ఆ రోజున ఉదయం 11 గంటలకు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించనున్నారు. అయితే గతంలో కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. సా. 5 గంటలకు ప్రవేశపెట్టే సంప్రదాయానికి 1999లో స్వస్తి పలికారు. అప్పటి వరకు ప్రతి ఏడాది సాయంత్రం 5 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేవారు.
సా. 5 గంటలకే ఎందుకు ప్రవేశపెట్టేవారో తెలుసా..?
1999 వరకు కేంద్ర బడ్జెట్‌ను ప్రతి ఏడాది ఫిబ్రవరి చివరి రోజున సాయంత్రం 5 గంటలకు ప్రవేశపెట్టేవారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. వలసరాజ్య కాలంలో, బ్రిటిష్ సమ్మర్ టైమ్ కంటే భారతీయ టైమ్ జోన్ 4.5 గంటల ముందు ఉంటుంది.. అందుకే.. ఇండియాలో సాయంత్రం 5 గంటలకు బడ్జెట్‌ని ప్రవేశపెడితే.. బ్రిటన్‌లో అది ఉదయం 11 గంటలుగా ఉండేది. కాబట్టి వారికి వీలుగా నాడు బడ్జెట్‌ను 5 గంటలకు ప్రవేశపెట్టే పద్ధతిని తీసుకొచ్చారు. ఇదే పద్ధతిని 1999 వరకు అమలు చేశారు.
మరి ఆ సంప్రదాయానికి ముగింపు పలికిందేవరు..?
1999లో అటల్ బిహారి వాజ్‌పేయీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న యశ్వంత్ సిన్హా.. సాయంత్రం 5 గంటలకు బడ్జెట్ ప్రవేశపెట్టే విధానానికి ముగింపు పలికారు. కేంద్ర బడ్జెట్‌ను ఉదయం 11 గంటలకే సభలో ప్రవేశపెట్టాలని సిన్హా సూచించారు. 11 గంటలకు బడ్జెట్ ప్రవేశపెడితే.. ఆ ప్రసంగాన్ని మరింత మెరుగ్గా విశ్లేషించడానికి తగినంత సమయం లభిస్తుందని ఆయన ప్రతిపాదించారు. ఆర్థిక మంత్రి ప్రతిపాదనకు సభ్యుల నుంచి ఆమోదం లభించింది. దీంతో 1999 ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 11 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారి ఇలా జరిగింది. ఇక అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఉదయం 11 గంటలకు కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
ఫిబ్రవరి చివరి దినం నుంచి 1వ తేదీకి ఎలా మారింది..?
అయితే ఫిబ్రవరి చివరి దినం నుంచి ఆ నెల ఒకటో తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సంప్రదాయానికి 2017లో ఆర్థిక మంత్రిగా ఉన్న అరుణ్ జైట్లీ నాంది పలికారు. ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంతో.. ఏప్రిల్ 1 నుంచి కొత్తగా ప్రారంభం కాబోయే ఆర్థిక సంవత్సరానికి కొత్త బడ్జెట్ విధానాలను అమలు చేయడం సులభతరం అవుతుందని వారు మార్పు చేశారు. ఇక నాటి నుంచి ఫిబ్రవరి 1వ తేదీనే కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల కారణంగా ఫిబ్రవరి 1న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. జులై 23న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు నిర్మల సీతారామన్. ఫిబ్రవరి 1, 2021 నుంచి పేపర్‌లెస్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.