Viral Video | చిరుత పులిని ఒంటి చేత్తో ఎదిరించిన ఫారెస్ట్ ఆఫీస‌ర్.. ఎక్క‌డంటే..?

  • Publish Date - April 4, 2024 / 10:39 AM IST

Viral Video | చిరుత పులులు అడ‌వుల‌ను వ‌దిలేసి జ‌న‌వాసాల్లోకి వ‌స్తున్నాయి. ఇక గ్రామాల్లో చిరుత‌లు సంచ‌రిస్తూ స్థానికుల‌ను తీవ్ర భ‌యాందోళ‌న‌కు గురి చేస్తున్నాయి. కొన్ని సంద‌ర్భాల్లో జ‌నాల‌పై కూడా దాడి చేసి భ‌క్షిస్తున్నాయి. అయితే ఓ గ్రామంలోకి ప్ర‌వేశించిన చిరుత పులిని ఓ ఫారెస్ట్ ఆఫీస‌ర్ ధైర్యంగా ఎదురించాడు. చివ‌ర‌కు ఆ చిరుత‌ను ఒంటి చేత్తో ఎదుర్కొని బంధించాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. సెంట్ర‌ల్ క‌శ్మీర్‌లోని గందేర్బ్ జిల్లాలోని ఫ‌తేపూర గ్రామంలోకి బుధ‌వారం చిరుత ప్ర‌వేశించింది. గ్రామంలో తిరుగుతూ గాండ్రిపులు చేస్తూ స్థానికుల‌ను భ‌య‌పెట్టించింది ఆ చిరుత‌. ఇద్ద‌రు మ‌హిళ‌ల‌పై కూడా దాడి చేసింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన స్థానికులు పోలీసుల‌కు, అట‌వీశాఖ అధికారుల‌కు స‌మాచారం అందించారు. ఇక గ్రామంలోకి చేరుకున్న చిరుత‌ను బంధించేందుకు అధికారులు, పోలీసులు క‌లిసి తీవ్ర ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ అది దొర‌క‌లేదు. చివ‌ర‌కు ఓ ఫారెస్ట్ ఆఫీస‌ర్ చిరుత‌కు ఎదురుగా వెళ్లాడు. దాన్ని క‌ర్ర‌తో కొట్టేందుకు ప్ర‌య‌త్నించ‌గా, అత‌నిపై దాడి చేసి చేతిని చేజిక్కించుకుంది. అయినా ఆ అధికారి బెద‌ర‌లేదు. దానితో పోరాడుతూనే.. నేల‌పై గ‌ట్టిగా చిరుత‌ను అదిమిప‌ట్టాడు. ఇక‌ అక్క‌డే ఉన్న పోలీసులు, స్థానికులు క‌లిసి చిరుత వెనుక భాగంలో క‌ర్ర‌ల‌తో కొట్టారు. మొత్తానికి చిరుత అధికారి చేతిని విడిచిపెట్టింది. చిరుత‌ను మిగ‌తా వారంతా క‌లిసి తొక్కి పెట్టి మ‌త్తు మందు ఇచ్చారు. అనంత‌రం అట‌వీశాఖ అధికారులు చిరుత‌ను స్వాధీనం చేసుకున్నారు.

చిరుత‌ను బంధించేందుకు చేసిన ఆప‌రేష‌న్‌లో మొత్తం ఇద్ద‌రు ఫారెస్ట్ ఆఫీస‌ర్స్ గాయ‌ప‌డ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చిరుత‌ను ఎదురించిన ఫారెస్ట్ ఆఫీస‌ర్‌పై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. నెటిజ‌న్లు అత‌ని వీరోచిత పోరాటాన్ని ప్ర‌శంసిస్తున్నారు.

Latest News