Woman Murder | లక్నో : కట్నం కింద బుల్లెట్ బండి, బర్రెను తీసుకురాలేదని చెప్పి.. ఓ వివాహితపై విచక్షణారహితంగా దాడి చేశారు. చివరకు ఇనుప కడ్డీలను కాల్చి.. వాటిని ప్రయివేటు భాగాల్లో చొప్పించి అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. అలీఘర్ జిల్లాలోని బనుపురా గ్రామానికి చెందిన బంటీ కుమార్‌కు సంగీత(32)తో పదేండ్ల క్రితం వివాహమైంది. ఈ దంపతులకు ఇద్దరు మగ పిల్లలు ఉన్నాయి. అయితే పెళ్లైన ఏడాది వరకు వీరి సంసార జీవితం బాగానే సాగింది. ఆ తర్వాత వరకట్న వేధింపులు మొదలయ్యాయి.
వరకట్నం కింద బుల్లెట్ బండి, బర్రెను తీసుకు రావాలని సంగీతను అత్తింటి వారు వేధింపులకు గురి చేశారు. ఈ రెండు తీసుకు రావాలని చెప్పి.. సంగీతను భర్త రోజు హింసించేవాడని మృతురాలి తల్లి పేర్కొంది. లేదంటే చంపేస్తానని బెదిరింపులకు గురి చేసినట్లు సంగీత తనకు చెప్పి బాధపడినట్లు ఆమె తెలిపింది.
గత మంగళవారం బంటీ, ఆయన తల్లి, సోదరీమణులు కలిసి సంగీతను దారుణంగా కొట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇనుప రాడ్లను బాగా కాల్చి.. వాటితో ప్రయివేటు భాగాల్లో దాడి చేసి హింసించారు. శరీరంలో అక్కడక్కడ కాలిన గాయాలను కూడా గుర్తించినట్లు పేర్కొన్నారు. ప్రయివేటు భాగాల్లో దాడి చేయడంతోనే ఆమె చనిపోయినట్లు నిర్ధారణ అయింది. పోస్టుమార్టం రిపోర్టులో మరిన్ని విషయాలు వెల్లడి అయ్యే అవకాశం ఉందన్నారు.
ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బంటీతో పాటు ఆయన తల్లి, సోదరీమణుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. అయితే బంటీ ఇంటికి తాళం ఉందని పోలీసులు తెలిపారు.