బీజేపీకి అంత సీన్ లేదు ఎన్డీయేకూ మెజార్టీ అసాధ్యం..ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్రయాదవ్‌

బీజేపీకి అంత సీన్‌ లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్రయాదవ్‌ తేల్చిచెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు కాదుకదా.. మెజార్టీ మార్కు 272 సీట్లను కూడా బీజేపీ దాటలేదని స్పష్టంచేశారు

  • Publish Date - May 26, 2024 / 08:51 PM IST

  • బీజేపీకి మెజార్టీ రాదు
  • చివరి రెండు దశలే కీలకం
  • వాటిలో ఇబ్బందులు వస్తే ఎన్డీయేకూ మెజార్టీ అసాధ్యం
  • ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్రయాదవ్‌
  • బీజేపీ విజయాన్ని సూచించారంటూ వక్రీకరించిన గోడీ మీడియా

న్యూఢిల్లీ: ‘అబ్‌ కీ బార్‌ చార్‌ సౌ పార్‌’ అని చెప్పుకొంటున్న బీజేపీకి అంత సీన్‌ లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్రయాదవ్‌ తేల్చిచెప్పారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో నాలుగు వందల సీట్లు కాదుకదా.. మెజార్టీ మార్కు 272 సీట్లను కూడా బీజేపీ దాటలేదని స్పష్టంచేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ దారుణంగా దెబ్బతింటుందని పేర్కొన్నారు. బీహార్‌, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో బీజేపీ సీట్లు గణనీయంగా తగ్గుతాయని తెలిపారు. రాజస్తాన్‌, గుజరాత్‌లలోనూ బీజేపీకి సీట్లు తగ్గుతాయని తెలిపారు. ఈ మేరకు యూట్యూబ్‌లో ఒక వీడియోను ఆయన విడుదల చేశారు. ప్రతిపక్ష కూటమిలోని ప్రధాన పక్షం కాంగ్రెస్‌ 100 సీట్లను దాటే అవకాశం ఉన్నదని యోగేంద్ర అంచనా వేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని రాజకీయ విశ్లేషకుడు ప్రశాంత్‌ కిశోర్‌, అమెరికా ఎన్నికల నిపుణుడు ఇయాన్‌ బ్రెమ్మర్‌ అంచనా వేసిన నేపథ్యంలో యోగేంద్ర తన అంచనాలను విడుదల చేశారు.

ఐదు దశల పోలింగ్‌ సరళిని పరిశీలించిన అనంతరం తానీ అంచనాలు వెలువరిస్తున్నట్టు యోగేంద్ర తెలిపారు. బీజేపీ 260కి, 240కి పడిపోయినా ఆశ్చర్యం లేదన్నారు. ఇతర ఎన్డీయే భాగస్వామ్యపక్షాలకు 35 నుంచి 45 సీట్లు రావచ్చని పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు 85 నుంచి 100 సీట్లు, ఇండియా కూటమిలోని ఇతర పక్షాలకు 120 నుంచి 135 సీట్లు వస్తాయని అంచనా వేశారు. ‘ఎన్డీయే 400 సీట్లు దాటటం కాదుకదా.. బీజేపీ మూడు వందలు దాటడం కూడా కష్టమే’ అని పేర్కొన్నారు. ఎన్డీయే కూటమి మెజార్టీకి దగ్గరగా ఉండేందుకు అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అయితే.. అదికూడా చివరి రెండు దశల పోలింగ్‌పై ఆధారపడి ఉంటుందని తెలిపారు. ఈ దశల్లో కీలకమైన ఢిల్లీ, పంజాబ్‌, హర్యానాలతోపాటు యూపీ, బెంగాల్‌ తదితర రాష్ట్రాల్లో ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే ఎన్డీయే కూడా మెజార్టీకి దూరంగానే ఉండిపోతుందని యోగేంద్ర యాదవ్‌ తేల్చి చెప్పారు.. అయితే.. యోగేంద్ర చెప్పిన మొదటి రెండు వ్యాక్యాలనే ప్రస్తావిస్తూ.. 305 సీట్లతో బీజేపీ గెలుస్తుందని చెప్పారంటూ మోదీ అనుకూల మీడియా వెంటనే వక్రీకరణలు మొదలు పెట్టడం విశేషం.

Latest News