Site icon vidhaatha

Media: అధికార ‘గళాల’కే లక్ష్మీ కటాక్షం! వారి మీడియాలకు ప్రకటనల పంట

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (విధాత) : పత్రికలు, మీడియా సంస్థలను నడపటం దేశంలో రానురాను ఆర్థిక భారంగా మారిపోతున్నది. నిర్వహణ భారం భరించలేక దేశంలో అనేక ప్రముఖ మీడియా సంస్థలు కూడా చాప చుట్టేశాయి. అయితే అధికార పార్టీ పత్రికలు, టీవీ చానళ్లకు, సోషల్ మీడియా సంస్థలకు మాత్రం పాలకుల కృపా కటాక్షాలు దండిగా ఉంటున్నాయి. దీంతో రాజుల కాలంలో ఆస్థాన కవుల వైభోగం మాదిరిగా పాలకవర్గ మీడియా సంస్థలు కాసుల పంట పండించుకుంటున్నాయి. ఆస్థాన కవి పండితుల మాదిరిగానే పాలకవర్గ మీడియా సంస్థలు ప్రభుత్వాల భజన మరో పెద్ధకథ.

దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు తమ రాజకీయ మనుగడకు పత్రికలు, టీవీలు నడిపిస్తున్నాయి. రానురాను పార్టీల మీడియా సంస్థలు అక్రమ సంపాదనలకు, క్విడ్ ప్రో కో సొమ్ములు..పెట్టబడుల మళ్లింపులకు వేదికలుగా.. మనీ లాండరింగ్, హవాలా లావాదేవీలకు సాధనాలుగా మారిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. ఇందులో కాంగ్రెస్ తొలినాళ్లలో స్థాపించిన నేషనల్ హెరాల్డ్ మొదలుకుని, తమిళనాడు, ఏపీ, తెలంగాణలోని రాజకీయ పార్టీల మానస పుత్రికలుగా మనుగడ సాగిస్తున్న మీడియా సంస్థలు కూడా అభియోగాలు ఎదుర్కొంటున్నాయి.

ఆస్థాన మీడియా అక్రమాలపై రచ్చ

అధికార రాజకీయ పార్టీల సొంత, అనుబంధ మీడియా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనల పేరుతో భారీగా దోచిపెట్టడం తెలుగు రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా పతాక స్థాయికి చేరింది. టీడీపీ అధికారంలో ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు మిగతా మీడియా సంస్థల కంటే అధిక మొత్తంలో ప్రకటనల రూపంలో ముడుతుందనే వాదనలు ఉన్నాయి. వైఎస్సార్ ప్రభుత్వం హయాంలో సాక్షి పత్రికకు భారీ మొత్తంలో ప్రభుత్వ ప్రకటనలు అందడంతో పాటు క్విడ్ ప్రోకో సొమ్ము సాక్షి మీడియా సంస్థల్లోకి మళ్లినట్లుగా అభియోగాలు నమోదై కేంద్ర, రాష్ట్ర దర్యాప్తు సంస్థల విచారణలకు దారితీశాయి. ఇంతలో రాష్ట్ర విభజన జరిగి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు వేర్వేరు రాష్ట్రాలు అవతరించాయి. ఏపీలో తొలి ఐదేళ్లలో టీడీపీ పాలనలో వారి అనుకూల ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు అగ్రతాంబులం దక్కిందంటూ వైసీపీ పార్టీ ఆరోపించింది. తదుపరి ఐదేళ్లలో వైసీపీ అధికారంలో ఉండగా సాక్షి మీడియా సంస్థలకు ప్రభుత్వ ప్రకటనల రూపంలో ప్రభుత్వ నిధులు దండిగా కట్టబెట్టారని టీడీపీ ఆరోపించింది.

తిరిగి టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక జగన్ ప్రభుత్వం హయాంలో మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనలపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. 2019-24మధ్య జగన్ ప్రభుత్వం మొత్తం రూ.859.29కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేసింది. ఇందులో జగన్ హయాంలో మొత్తం పత్రికలకు ఇచ్చిన ప్రకటనల్లో 43శాతం అంటే రూ.371.2కోట్లను సాక్షి పత్రికకు జారీ చేశారని ఏసీబీ తేల్చింది. అదే సమయంలో అన్ని టీవి చానళ్లకు కలిపి రూ.28.71కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారు. వాటిలో సాక్షితో పాటు వైసీపీ అనుకూల టీవీ చానళ్లకు రూ.16.17కోట్ల ప్రకటనలు ఇచ్చారు. ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, టీవీ 5, మహాన్యూస్ వంటి చానళ్లకు, ఆంధ్రజ్యోతి పత్రికకు ఒక్క ప్రకటన కూడా ఇవ్వలేదని గుర్తించింది.

అంతేగాక ప్రభుత్వ ఉత్తర్వులు, సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్దంగా అడ్డగోలుగా టారిఫ్‌లు పెంచి, సమాచార పౌరసంబంధాల శాఖ సాక్షి మీడియా సంస్ధలకు ప్రకటనలు జారీ చేసిందని పేర్కొంది. సాక్షి పత్రిక, టీవీకి అప్పటి సమాచార శాఖ పౌర సంబంధాల శాఖ కమిషనర్ విజయ్ కుమార్ రెడ్డి అనుచిత లబ్ధి చేకూర్చారని ఏసీబీ ప్రాథమిక దర్యాప్తులో తేల్చింది. ఈ మేరకు ఆయనపై అభియోగాలు మోపింది. నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో 1981 జూలై 23న జీవో 431ద్వారా పక్షపాతానికి తావులేకుండా మీడియా సంస్థలకు ప్రభుత్వ ప్రచార ప్రకటనలు జారీ చేయాలని ఆదేశాలున్నాయి. పత్రికల సర్క్యూలేషన్ ఆధారంగా అందరికి అవకాశం కల్పించేలా ప్రకటనలు జారీ చేసి పత్రిక స్వేచ్ఛను పరిరక్షించాలని సుప్రీంకోర్టు మార్గదర్శకాలున్నాయి.

తెలంగాణలోనూ అస్థాన మీడియా పోషణకే పట్టం

తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తన మీడియా సంస్థలు నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే, టీ న్యూస్ లకు సింహభాగం ప్రభుత్వ ప్రకటనలు కట్టబెట్టడం ద్వారా అనుచిత లబ్ధి చేకూర్చిందని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోపిస్తున్నది. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వం ఇటీవల బహిర్గతం చేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2014-2023 మధ్య కాలంలో 1,757కోట్లను ప్రభుత్వ ప్రకటనలకు వెచ్చించగా.. అప్పటి సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన మీడియా సంస్థలకు 38.4శాతం నిధులు మళ్లించారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు డైరక్టర్లుగా ఉన్న మీడియా సంస్థలకు ఏకంగా రూ.348.43కోట్ల ప్రకటనలు జారీ చేశారు. ఇందులో నమస్తే తెలంగాణకు రూ.182కోట్లు, తెలంగాణ టుడేకు రూ.150కోట్లు, టీ న్యూస్ చానల్ కు రూ.16.43కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారు.

పత్రికల సర్క్యూలేషన్లను, టారిఫ్ లను పెంచి మరి ప్రకటనలు ఇచ్చుకున్నారని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంటున్నది. తన మీడియా సంస్థల టారిఫ్ రేట్లను అడ్డగోలుగా పెంచుకుని..గిట్టని పత్రికల టారిఫ్ లు తగ్గించేశారని..వారికి ప్రకటనలు ఇవ్వకుండా మార్గదర్శకాలను తుంగలో తొక్కారని లెక్కలు తేల్చింది. అప్పటి సీఎం కేసీఆర్ సమాచార శాఖకు ప్రాతినిధ్యం వహించినందున.. అక్రమాలకు ఆయన బాధ్యత వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నది. ఓ పత్రికకు ప్రకటనలు ఇవ్వాలంటే కనీసం 18నెలలు ఆ పత్రిక ప్రచురణలు వెలువడాలన్న నిబంధనలుండగా..తెలంగాణ టుడే పత్రిక ప్రారంభమైన మూడు నెలలకే అధికారిక ప్రకటనలు జారీ చేశారని ప్రభుత్వ వర్గాలు వెల్లడించడం గమనార్హం. ఉమ్మడి రాష్ట్రంలో నమస్తే తెలంగాణ ప్రకటనల టారిఫ్ రూ.875 ఉండగా..బీఆర్ఎస్ పాలనలో రూ.1500కు పెరిగిపోయిందని ఇది బీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి నిదర్శనమని కాంగ్రెస్ విమర్శించింది.

Exit mobile version