విధాత: మనదేశ ప్రజలు ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నెల రోజులుగా ఎదురు చూస్తున్న అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) ల పుష్ప2 ది రూల్ (Pushpa 2) చిత్రం ఎట్టకేలకు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దీంతో సినీ లవర్స్ ఆనందానికి పట్టపగ్గాలేకుండా పోయాయి. ఇప్పటికే నాలుగైదు మార్లు చూసిన వారు, ఇంతవరకు చూడని వారు గురువారం తెల్లవారు జాము నుంచే సినిమాను చూసేస్తున్నారు. సినిమా విడుదల సమయంలో జరిగిన ఘటన బాధ పెట్టినా బాలీవుడ్‌లో హిందీ సినిమాలను కాదని రికార్డులు నెలకొల్పి చరిత్ర సృష్టించింది. అక్కడి జనం ఎగబడి మరి చూడడంతో బాలీవుడ్ సినీ పండితులు సైతం అశ్చర్యపోమయారంటే పుష్ప2 చేసిన మ్యాజిక్ ఏంటో ఇట్టే తెలుస్తుంది.
పుష్ప1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో అంతకు రెట్టింపు అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ పుష్ప2 ది రూల్ బాక్సాపీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేసింది. రూ 1896కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు నిర్మాతలు అధికారికంగా ప్రకటించగా ఇంకా ఓటీటీ, శాటిలైట్ హక్కులను కలుపుకుని ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఇప్పటివరకు దంగల్ పేరిట ఉన్న రికార్డును పుష్ప2 ది రూల్ (Pushpa 2) తుడిచి పెట్టేసింది. మొదట 3గంటల 20 నిమిషాల నిడివితో డిసెంబర్ 4న రాత్రి షోతో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇటీవల సంక్రాంతిని పురస్కరించుకుని అదనంగా మరో 20 నిమిషాల సన్నివేశాలను జోడించి రీలోడెడ్ వర్షన్‌గా రిలీజ్ చేశారు.
ఎర్ర చందనం సిండికేట్‌గా మారిన పుష్పరాజ్ ఇంటి విషయానికి వస్తే శ్రీవల్లి మాట జావదాటకుండా ఉంటుంటాడు. ఓరోజు భార్య కోరిక మేరకు సీఎంతో ఫొటో దిగే విషయంలో వచ్చిన గొడవ కాస్త సీఎంను మార్చే వరకు వస్తుంది. ఈ నేపథ్యంలో పుష్పకు ఎదురైన పరిస్థితులు ఏంటి, తన ఇంటిపేరును తిరిగి దక్కించుకో గలిగాడీ లేదా అనే కథ కథనాల నేపథ్యంలో సినిమా ఆద్యంతం సగటు ప్రేక్షకుడికి కిక్కు ఎక్కించేలా రూపొందించారు. పాటలు, అల్లు అర్జున్ డ్యాన్సులు ఆకట్టుకుంటాయి. రీలోడెడ్ వెర్షన్ 3.44 నిమిషాల నిడివితో ఓటీటీకి వచ్చిన పుష్ప2 ది రూల్ (Pushpa 2) మూవీ నెట్‌ఫ్లిక్స్ (Netflix) లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. రీలోడెడ్ వెర్షన్ చూడని వారు, సినిమాను ఇప్పటివరకు అసలు చూడని వారు ఇప్పుడు అసలు మిస్ చేయకుండా ఇంట్లోనే చూసేయండి. అయితే ఒకటి రెండు సందర్భాల్లో పిల్లలు చూడకుండా స్కిప్ చేయడం మంచిది.