– పుష్కరాలపై పట్టింపేది?
– రూ.35 కోట్లు ఏ మూలకు సరిపోతాయి?
– కుంభమేళాలో 50 కోట్ల మంది భక్తులకు ఆతిథ్యం
– 50 లక్షల మంది భక్తులకు ఏర్పాట్లు చేయలేరా?
– కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
Bandi Sanjay| విధాత, కాళేశ్వరం రాష్ట్ర ప్రభుత్వానికి అందాల పోటీల మీదున్న శ్రద్ధ పుష్కరాల మీద లేదా? అంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం 50 కోట్ల మంది భక్తులకు కుంభమేళాలో ఆతిథ్యం ఇచ్చిందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం 50 లక్షల మంది భక్తులకు కూడా ఏర్పాట్లు చేయలేకపోయిందని విమర్శించారు.
ఒకవేళ తెలంగాణలో బీజేపీ అధికారంలో ఉంండి ఉంటే అంగరంగ వైభవంగా పుష్కరాలు నిర్వహించేవారమని చెప్పారు. సోమవారం ఆయన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం వద్దనున్న సరస్వతి నదీలో పుష్కరస్నానం చేశారు. అనంతరం ముక్తేశ్వరుడిని దర్శించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అందాల పోటీపై ఉన్న శ్రద్ధ పుష్కరాల నిర్వహణపట్ల లేకుండా పోయిందని బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు రూ.35 కోట్లు మాత్రమే కేటాయించారని, ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించారు.
కుంభమేళా సందర్భంగా 50 కోట్ల మంది భక్తులకు తమ ప్రభుత్వం అద్బుతమైన ఆతిథ్యమిచ్చిందని, కాళేశ్వరం పుష్కరాలకు విచ్చేసే 50 లక్షల మందికి సరైన ఆతిథ్యం ఇవ్వలేకపోతున్నారని అసహనం వ్యక్తం చేశారు. పుష్కరాల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు. ‘సరస్వతి పుష్కరాల సందర్భంగా ఈరోజు కాళేశ్వరం విచ్చేసి పుష్కర స్నానం ఆచరించడం చాలా సంతోషంగా ఉంది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం ఇది. దేశ ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని, వారి కష్టాలన్నీ తొలగిపోవాలని, నరేంద్రమోదీ నాయకత్వంలో దేశానికి మరింతగా సేవలందించేలా దీవించాలని ఆ స్వామివారిని ప్రార్థించాను.
సరస్వతి పుష్కరాలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం రూ.35 కోట్లు మాత్రమే కేటాయించింది. అధికారులు కష్టపడుతున్నప్పటికీ ఆ నిధులు ఏ మూలకు సరిపోతాయి? ఉత్తర ప్రదేశ్ లో కుంభమేళా సందర్భంగా 50 కోట్ల మంది భక్తులకు అద్బుతమైన ఆతిథ్యం ఇచ్చారు. కానీ ఇక్కడ 50 లక్షల మంది దర్శించుకునే పుష్కరాలకు ఈ నిధులు ఏ మూలకు సరిపోతాయి? ఏమైనా మాట్లాడితే కేంద్రం ఏం చేస్తోందని మాట్లాడతారు. అన్నీ కేంద్రమే చేస్తే ఇక మీరున్నది ఎందుకు? కేవలం ఒక ఏరియాకే పుష్కరాలను పరిమితం చేయడం సరికాదు. ’ అంటూ విమర్శించారు.