Betting Apps| Balakrishna
విధాత : సోషల్ మీడియా ఇన్ ఫ్లూయర్స్ నుంచి టాలీవుడ్ సెలబ్రెటీల వరకు కేసుల పాలవుతున్న బెట్టింగ్ యాప్స్ వివాదం సీనియర్ హీరో, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వరకు చేరింది. బాలకృష్ణ హోస్టు గా చేస్తున్న ఆహా యాప్ అన్ స్టాపబుల్ షోలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయడం ఇప్పుడు వివాదస్పదంగా మారింది. అహా అనే ఓటీటీ యాప్ లో బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న అన్ స్టాపబుల్ షోలో వచ్చిన ఓ బెట్టింగ్ యాప్ ను చూసి దాన్ని డౌన్ లోడ్ చేసుకుని రూ.80లక్షలు పొగొట్టుకున్నానని నెల్లూరుకు చెందిన బాధితుడు శ్రీరాంబాబు మీడియాకు వెల్లడించడం సంచలనంగా మారింది. దీనిపై ఆయన హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఆహా షోలో ప్రభాస్, గోపిచంద్ లకు బాలయ్య ఇచ్చిన ప్రజంటేషన్ పై ఫన్ 88 బెట్టింగ్ యాప్ ఉంటుందని..అది చూసి నేను ఆ యాప్ లో బెట్టింగ్ చేసి మోసపోయి ఓ దశలో ఆత్మహత్య యత్నం కూడా చేసుకున్నానని తెలిపారు. శ్రీరాంబాబు చెప్పింది నిజమేనంటూ ఆహా షో బెట్టింగ్ యాప్ ప్రమోషన్ ఫోటోలను నెటిజన్లు పోస్టు చేస్తున్నారు. ఆహా యాప్ టాలీవుడ్ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్, మై హౌస్ జాయింట్ వెంచర్ యజమాన్యంలో ఉంది. యాప్ అల్లు అర్జున్ కూతురు ఆర్హా మీడియా ఆండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో నమోదైంది. దీంతో ఆహా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల వ్యవహారంలో పోలీసులు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పోలీసులు చట్టపర చర్యలకు ఉపక్రమిస్తే మాత్రం బాలయ్యకు, అల్లు ఫ్యామిలీలకు కేసుల తిప్పలు తప్పకపోవచ్చు.