విధాత: కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టుల సాధనకు సంబంధించి చర్చించేందుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన ఏర్పాటు చేసిన అఖిల పక్ష ఎంపీల సమావేశానికి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల ఎంపీలు డుమ్మా కొట్టారు. తమకు మీరు నిన్ననే ఫోన్ చేసి సమాచారం ఇచ్చారని..అప్పటికే ఖరారైన అధికారిక కార్యక్రమాల నేపథ్యంలో తగిన సమయం లేక తాము ఎంపీల సమావేశానికి హాజరుకావడం లేదని కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు సమాచారం ఇచ్చారు. భవిష్యత్తులో ఈ రకమైన సమావేశాల సమాచారాన్ని ముందస్తుగా ఇవ్వాలని కోరారు. బీజేపీ మిగతా ఎంపీలు కూడా ఈ సమావేశానికి దూరంగా ఉన్నారు.
అలాగే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు(రాజ్యసభ సభ్యులు) కూడా ఎవరు ఈ సమావేశానికి హాజరుకాలేదు. తాము ఈ సమావేశానికి హాజరుకాబోమని ఆ పార్టీ ప్రకటించింది. కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం నుంచి కోరుతున్న నిధులు, ప్రాజెక్టుల అనుమతులపై తమ పార్టీ వైఖరి చెప్పాల్సి వస్తుందన్న కోణంలోనే బీజేపీ, బీఆర్ఎస్ లు ఈ భేటీకి గైర్హాజరయ్యాయా అన్న చర్చ వినిపిస్తుంది.
ఇక ఎంఐఎం తరుపున ఆ పార్టీ ఏకైక ఎంపీ అసదుద్ధీన్ ఒవైసీ అఖిల పక్ష సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం ఏర్పాటును స్వాగతించిన అసదుద్ధీన్ కేంద్రం నిధుల కేటాయింపులో అన్యాయం చేస్తుందని..పారదర్శకంగా వ్యవహరించడం లేదంటూ విమర్శలు చేశారు. ఆర్ఆర్ఆర్ మంజూరు, మెట్రో విస్తరణ, బాపు ఘాట్ అభివృద్ధి, మూసీ ప్రక్షాళణ కోసం రాష్ట్రం నిధులు అడిగితే స్పందన లేదన్నారు. ఐపీఎస్ అధికారుల సంఖ్య పెండచాలని కోరామన్నారు. తెలంగాణ ప్రజలు ప్రధాని మోడీకి 8మంది ఎంపీలిచ్చినా రాష్ట్రంపై సవతితల్లి ప్రేమ చూపిస్తున్నారన్నారు.
కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ సమస్యల సాధన ఎజెండాగా సమావేశానికి అధ్యక్షత వహించిన భట్టి మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని కలవడం..పార్లమెంటులో సమస్యలు లేవనెత్తడం ద్వారా కేంద్రం నుంచి నిధుల సాధనకు పోరాడాలన్నారు. దాదాపు 28అంశాలపై సమావేశంలో చర్చించామని భట్టి మీడియాకు తెలిపారు. విభజన సమస్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినట్లుగా చెప్పారు.