ముంబయి: క్యాన్సర్ రోగుల కుటుంబాలు చికిత్స ఖర్చులు భరించలేక ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లిపోతున్నాయని సీఐఈయూ నివేదిక వెల్లడించింది. క్యాన్సర్ చికిత్స ఖర్చులు భారతీయ రోగులకు సులభంగా అందుబాటులో ఉండాలని న్యూఢిల్లీకి చెందిన మేథావుల సంఘం కౌన్సిల్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకనమిక్ అండర్‌స్టాండింగ్ (సీఐఈయూ) నివేదికలో పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. వివిధ వ్యాధుల వల్ల ప్రతి సంవత్సరం 3.2 నుంచి 3.9 కోట్ల మంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారు. ఎక్కువగా డబ్బు ఖర్చు చేయాల్సి రావడం, బీమా సహాయం తక్కువగా ఉండటం భారతీయ కుటుంబాలపై ఆర్థిక ఒత్తిడిని కలిగిస్తోంది.
ఖరీదైన బయోలాజిక్ చికిత్సలతో పోల్చితే, బయోసిమిలర్స్ తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉండే ప్రత్యామ్నాయంగా నిలుస్తాయి. ఈ బయోసిమిలర్లను ప్రోత్సహించే విధానాలు భారతదేశంలో అమలు చేయాలని సీఐఈయూ సిఫారసు చేసింది. ఈ నివేదిక భారీ సంఖ్యలో భారతీయులను ప్రభావితం చేస్తున్న వ్యాధులకు తక్కువ ఖర్చుతో చికిత్స అందించడంలో బయోసిమిలర్ల ప్రాముఖ్యతను వివరిస్తుంది. సొంతంగా ఎక్కువ ఖర్చు చేయాల్సి రావడం, బీమా సహాయం సరిపడకపోవడం వల్ల లక్షలాది మంది ఆర్థికంగా దిగజారుతున్నారని సీఐఈయూ తెలిపింది. 2022లో ఆరోగ్య ఖర్చుల్లో సొంత వాటా సుమారు 63 శాతంగా ఉంది, ఇది ప్రపంచంలోనే అత్యధిక స్థాయిలో ఒకటి.
పెరుగుతున్న ఇతర వ్యాధులు..
దేశంలో ప్రాణాంతక వ్యాధులు, జీవనశైలి సంబంధిత రుగ్మతలు పెరుగుతున్నాయి. 2022 నాటికి సుమారు 42 శాతం వయోజనులు, వృద్ధులు కనీసం ఒక తీవ్రమైన వ్యాధితో బాధ పడుతున్నారు. వీటిలో రక్తపోటు, మధుమేహం సాధారణంగా కనిపిస్తున్నాయి. క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు పెరుగుతుండటం తక్కువ ఖర్చుతో చికిత్స అందించాల్సిన అవసరాన్ని సూచిస్తోంది. బయోసిమిలర్స్, ఆమోదిత బయోలాజికల్ ఔషధాలను పోలి ఉంటూ, తక్కువ ఖర్చుతో లభించే ఫార్మా ఉత్పత్తులుగా ఉన్నాయి. వీటి వినియోగాన్ని పెంచే విధానాలు చాలా ముఖ్యమని నివేదిక నొక్కి చెప్పింది. “క్యాన్సర్, ఆటోఇమ్యూన్ పరిస్థితుల వంటి తీవ్రమైన వ్యాధుల చికిత్స ఖర్చులు భారీగా ఉన్న నేపథ్యంలో, బయోసిమిలర్స్ తక్కువ ఖర్చుతో చికిత్స అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. చాలా మంది రోగులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆరోగ్య వ్యవస్థలో తక్కువ ఖర్చుతో చికిత్స లభ్యం కావడం చాలా అవసరం” అని నివేదిక తెలిపింది.
బయోసిమిలర్లు చికిత్స ఖర్చులను తగ్గించి, అందుబాటును మెరుగుపరుస్తాయి. దీనివల్ల క్యాన్సర్, మధుమేహం, ఆటోఇమ్యూన్ రుగ్మతలకు సంబంధించిన చికిత్సలు ఎక్కువ మందికి చేరువవుతాయి. అయితే, పేటెంట్ ఎవర్‌గ్రీనింగ్ వల్ల బయోసిమిలర్ల లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతోంది. ఔషధ కంపెనీలు చిన్న మార్పులతో పేటెంట్‌ను పొడిగించడం వల్ల బయోసిమిలర్ల ప్రవేశం ఆలస్యమవుతోంది. దీన్ని నియంత్రించడంలో భారతీయ చట్ట వ్యవస్థ కీలకంగా ఉన్నప్పటికీ, ఇంకా సవాళ్లు ఉన్నాయని నివేదిక వివరించింది.