Cashless treatment | అసలే వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిపోయిన నేపథ్యంలో రోడ్డు ప్రమాద బాధితుల కష్టం అంతా ఇంతా కాదు. ఆరోగ్య శ్రీ లేదా ఇతర బీమా ఉంటే ఫర్లేదు కానీ.. అవిలేని వారికి రోడ్డు ప్రమాదం చికిత్స ప్రాణాలకు మీదకు తెస్తున్నది. ఈ పరిస్థితిలో కేంద్రం ఒక వినూత్న పథకాన్ని తీసుకొచ్చింది. రోడ్డు ప్రమాదంలో బాధితులకు నగదు రహిత చికిత్స అందించాలని నిర్ణయించింది. దీనిపై కింది స్థాయి పోలీస్ అధికారులు, ఇతర విభాగాల అధికారులు సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రాష్ట్రంలో ఈ పథకం అమలుపై రవాణా, పోలీస్, హెల్త్, ఇన్సూరెన్స్, ఎన్ఐసీ ఇతర విభాగాల అధికారులతో సచివాలయంలోని తన చాంబర్‌లో మంత్రి పొన్నం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం తీసుకొచ్చిన కేంద్రమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరూ చనిపోకుండా ఉండడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
ఈ పథకం విజయవంతం కావడానికి రవాణా ,పోలీస్ ,హెల్త్ ,ఇన్సూరెన్స్ , ఎన్ఐసీ విభాగాలు కలిసి జిల్లా ,రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే పోలీసులకు సమాచారం ఇస్తే తమ మీద కేసులు అవుతాయనే భయం ఉండేదని అది అపోహ మాత్రమే అని తెలిపారు. ప్రమాదాలు జరగగానే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే చికిత్స అందించేలా అన్ని సౌకర్యాలతో మరిన్ని ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ లలో ఈ పథకం పై అవగాహన కల్పించాలని డీజీపీ జితేందర్ ను ఆదేశించారు.
మన జీవితంలో రోడ్డు ప్రమాదాల నుండి ఒక ప్రాణం రక్షించిన గొప్ప సంతృప్తి ఇస్తుందని ఇది ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలని సూచించారు. ఇది సామాజిక బాధ్యతగా అధికారులు వ్యవహరించాలన్నారు. ఈ పథకం పై సమాచార ప్రసార శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. పేదల్లో పేదలను రక్షించడానికి ఈ పథకం ఉపయోగపడుతుందని వెల్లడించారు. ఈ పథకం విజయవంతం కావడానికి అన్ని విభాగాల అధికారులు ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించాలని మంత్రి పొన్నం తెలిపారు. సమీక్షా సమావేశంలో డీజీపీ జితేందర్ ,అహ్మద్ నదీమ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫర్ ప్రిన్సిపల్ సెక్రటరీ,షాట్ చైర్మన్ శివసేన రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటీసీలు, యూనిసెఫ్, ఎన్ఐసీ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.