PDSC:
విధాత, వరంగల్: యూనివర్సిటీలకు నిధులను సమకూర్చడానికి ఏర్పడిన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దాని పరిధిని దాటి, నూతన నిబంధనల ముసాయిదాను విడుదల చేయడం పూర్తి అప్రజాస్వామికమని PDSU జాతీయ నాయకులు పి.మహేష్ ,పూర్వ టిపిటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి భోగేశ్వరరావు అన్నారు. PDSU వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కాకతీయ యూనివర్సిటీ ఎస్ డి ఎల్ సి ఈ జాఫర్ నిజాం సెమినార్ హాల్ లో శుక్రవారం మతోన్మాద బిజెపి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తీసుకొచ్చిన యు జి సి నూతన నిబంధనల ముసాయిదాను వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశానికి ముఖ్య వక్తలుగా హాజరైన వారు మాట్లాడుతూ కళాశాలలో, యూనివర్సిటీలలో అసిస్టెంట్, ప్రొఫెసర్, వైస్ చాన్సలర్ నియామకాల్లో నిబంధనలను సడలించారని విమర్శించారు. సెర్చ్ కమిటీల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను కాలరాయడం ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం అన్నారు. అధ్యాపక నియామకాలకు సంబంధించిన రిజర్వేషన్స్ పై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదని వీటితో ఉన్నత విద్యను అభ్యసించిన వెనుకబడిన సామాజిక వర్గాల వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందన్నారు.వీటి ద్వారా దేశంలో ఉన్న యూనివర్శిటీల్లో కేంద్ర ప్రభుత్వ రాజకీయ జోక్యాన్ని పెంచి విద్యను మరింత కార్పోరేటికరించడానికి, కాషాయకరించడానికి ఇవి తీసుకొస్తున్నారని మండిపడ్డారు. దీంతో విద్య పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మరింత దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
ముఖ్యంగా నూతన ముసాయిదా లో వైస్ ఛాన్స్ లర్ నియామకాల్లో కార్పొరేట్ కంపెనీల ప్రతినిధులను, ప్రైవేటు వ్యక్తులను, అనుభవం లేనివారిని వీసీలుగా నియమించే వెసులుబాటు కల్పించుకున్నారని దీని ద్వారా ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ కు చెందిన వారే ఇక నుండి వీసీ లుగా చలామణి అయితారని అన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పరీక్షలన్నీ సెంట్రలైజేషన్ చేసి దేశంలో ఉన్న ప్రతిష్టాత్మక యూనివర్సిటీలలో బిజెపి సంబంధించిన విద్యార్థులను పెద్ద ఎత్తున రిక్రూట్ చేశారన్నారు. కార్పొరేట్ నూతన జాతీయ విద్యా విధానం 2020 అమలులోకి వచ్చి అన్ని యూనివర్సిటీలలో కోర్స్ ఫీజులు, ఎగ్జామినేషన్ ఫీజులు భారీగా పెరిగాయి అన్నారు. తీవ్రమైన ఆర్థిక భారంతో విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు.
బిజెపి అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులపై తీవ్రమైన నిర్బంధకాండను ప్రయోగిస్తుందన్నారు. 11 ఏళ్ల మోడీ పాలనలో విద్యార్థులకు ఇవ్వవలసిన ఫెలోషిప్ స్కాలర్షిప్స్ లను పెంచకపోగా, భారీగా కోతలు విధిస్తుందన్నారు. ఇంకొక వైపు దేశ సంపదనంతట , కార్పొరేట్లకు కట్టబెడుతుందన్నారు. అంబానీ ఆదాని లాంటి కార్పొరేటు కంపెనీలకు వేల కోట్ల రూపాయలను రుణాలను మాఫీ చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు మొండి చేయి చూపిస్తుందన్నారు.
అమెరికా నుంచి భారత విద్యార్థులను వెనక్కి పంపించే ప్రక్రియలో కనీస గౌరవమర్యాదలను అమెరికా ప్రభుత్వం పాటించలేదని దానిని వ్యతిరేకించాల్సిన మోడీ ప్రభుత్వం వారికే వంత పాడింది అన్నారు. రాష్ట్రంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ నూతన జాతీయ విద్యా విధానం 2020, యూజీసీ ముసాయిదానం వెనక్కి తీసుకోవాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలన్నారు. ఈ కార్యక్రమం కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, ఏఐడీఎస్ఓ నాయకులు , మధుసూదన్, బీసీ విద్యార్థి సంఘం నాయకులు నాగరాజు PDSU పూర్వ జిల్లా అధ్యక్షులు రాచర్ల బాలరాజు PDSUఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధానకార్యదర్శి మర్రి మహేష్, కోశాధికారి పవన్, సభ్యులకు గణేష్, పండు, సంపత్ తదితరులు పాల్గొన్నారు.