విధాత, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లబోతున్నారు. ఇటీవల ముగ్గురు కొత్త మంత్రులు ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. వారికి ఇంకా శాఖలు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ప్రాధాన్యం సంతరించుకున్నది. హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యాశాఖ వంటి కీలకశాఖలు ఇంకా ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి.
వీటితోపాటు మరికొన్ని శాఖలు కూడా ఖాళీగా ఉన్నాయి. అయితే కొత్త మంత్రులకు ముఖ్యమంత్రి వద్ద ఉన్న శాఖలు కేటాయిస్తారా? లేక వేరే శాఖలు కేటాయిస్తారా? అన్న అంశంలో ఇంకా క్లారిటీ లేదు. గడ్డం వివేక్‌కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖలు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్థక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖలు కేటాయించే అవకాశం ఉందని జోరుగా కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన అనంతరం దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ వర్గీకరణ, బీసీ కులగణనపై విస్తృత ప్రచారం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నది. ఈ విషయంపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధిష్ఠానంతో చర్చించే అవకాశం ఉంది.