విధాత:పక్షం రోజుల వ్యవధిలో ఒకే కుటుంబంలోని ముగ్గురిని కరోనా వైరస్ బలితీసుకున్న సంఘటన రాప్తాడులో చోటుచేసుకుంది.
దీంతో ఆ కుటుంబాలు ఏకాకిగా మిగిలాయి. ఒక కుటుంబంలో ఇంటి పెద్ద, కుమారున్ని కోల్పోయి ఎవరి కోసం బతకాలని, మరో కుటుంబ పెద్ద చనిపోగా భార్య తన ఇద్దరు చిన్నారులను ఎలా పోషించుకోవాలని లోలోపల మాదనపడుతోంది. రాప్తాడుకు చెందిన నారాయణ, లక్ష్మమ్మకు రామకృష్ణ, శ్రీరాములు, నాగప్ప, శ్రీనివాసులు, గంగమ్మ, పద్మావతి, నారమ్మ సంతానమున్నారు. అన్నదమ్ములందరికీ పెళ్లిళ్లు అయి వేర్వేరుగా ఉన్న అంతా కలిసిమెలిసి అనందంగా గడిపేవారు. చిన్నాపెద్దా అనే తేడాలేకుండా అందరూ ఆప్యాయంగా పలకరించుకునేవారు.
రామకృష్ణ మెకానిక్ వృత్తి చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. భార్య సుబ్బమ్మ, కుమారుడు సాయి ఉన్నారు. సాయిని అల్లారుముద్దుగా పెంచుకుంటూ బీఎస్సీ వరకూ చదివించారు.
అయితే రామకృష్ణకు కరోనా వచ్చి 20రోజుల క్రితం మరణించారు. ఆయన పెద్దకర్మ రోజునే ఇతని తమ్ముడు శ్రీనివాసులు కరోనాతో మృత్యువాత పడ్డారు.
శ్రీనివాసులు విద్యుత్ మరమ్మతులు చేసుకుంటూ కుటుంబ జీవనం సాగించేవారు. ఇతనికి భార్య సునీత, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇక వీరిద్దరూ చనిపోయిన కొద్దిరోజులకే రామకృష్ణ కుమారుడు కూడా కరోనాకు గురై బెంగళూరులో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.
రామకృష్ణతోపాటు కుమారుడు సాయి కూడా మరణించడంతో ఆ నిరుపేద పెద్ద కుటుంబమంతా నిచ్చేష్టులై శోకసంద్రంలో మునిగిపోయారు.
శ్రీనివాసులు భార్య సునీత తన ఇద్దరు చిన్నారులను ఎలా పోషించుకోవాలో దిక్కుతెలీక వారం రోజులుగా రోదించడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి.
ఆయా కుటుంబాల స్థితిగతులను ప్రభుత్వాధికారులు పరిశీలించి ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.