విధాత, హైదరాబాద్: కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ పార్లమెంట్‌లో బిల్లును ప్రవేశపెట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ అన్నారు. వ్యవసాయ కార్మికులకు, పేదలకు తీవ్రంగా నష్టం చేసే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని ఈ నెల 18,19 తేదీల్లో గ్రామ గ్రామాన నిరసన తెలుపుతూ బిల్లు ప్రతులను దగ్ధం చేయాలని, 20వ తేదీన మండల కేంద్రాల్లో నిరసనలు తెలియజేయాలని సిపిఐ(ఎం) రాష్ట్ర కమిటీ పిలుపునిస్తున్నదని వెల్లడించారు.
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బలహీనవర్గాలకు చెందిన 30కోట్లమందికి పైగా పేదల ఉపాధిని కల్పిస్తున్న ఈ చట్టాన్ని నీరుగారుస్తున్నారు. పనిదినాలను పెంచామనే పేరుతో కూలీల సంఖ్యను భారీగా తగ్గిస్తున్నారు. ఇపుడున్న చట్టంలో 90శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సి వుండగా, దాన్ని 60శాతానికి కుదిస్తున్నారు. కోత పెడుతున్న 40శాతం నిధులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని చెప్తున్నారు. దీంతో నిధుల కొరత వున్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని ఎత్తివేసే ప్రమాదం ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
వ్యవసాయ పనులు వున్న సమయంలో ఈ బిల్లులో 60రోజుల పనిని నిషేధిస్తున్నారు. దీంతో కూలీలకు పని దొరకని స్థితి ఏర్పడుతుంది. కూలీ తగ్గుతుంది. అలాగే మహాత్మా గాంధీ పేరు తొలగించి చట్టం పేరుమార్చి వికసిత భారత్ ” గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ్ (విబి జి రాం జీ )పేరుగా తీసుకువస్తున్నారని విమర్శించారు.
గతంలో వున్న ఉపాధి హామీ చట్టం ప్రకారం 100 తగ్గకుండా పని కల్పించాలని, పనిదినాలు 200 రోజులకు పెంచాలని, కూలీని 307 నుండి రు.600 వరకు పెంచాలని, గత ఉపాధి చట్టాన్ని అమలు చేయాలని, తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని సిపిఐ(ఎం) తెలంగాణ రాష్ట్రకమిటీ డిమాండ్ చేస్తున్నదని జాన్ వెస్లీ పేర్కొన్నారు.
