Site icon vidhaatha

Jagadish Reddy: అసెంబ్లీ నుంచి.. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్షన్

Jagadish Reddy:

విధాత : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో రెండో రోజు గురువారం కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ ప్రకటించారు. ఈ బడ్జెట్ సమావేశాల సెషన్ మొత్తం కూడా జగదీష్ రెడ్డిని అసెంబ్లీ నుంచి సస్పెన్షన్ చేస్తున్నట్లుగా ప్రకటించారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా జి.జగదీష్ రెడ్డి మాట్లాడే క్రమంలో స్పీకర్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. సస్పెండ్ అయిన సభ్యుడిని వెంటనే బయటకు పంపాలని ఆదేశించారు.

శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి డి.శ్రీధర్ బాబు చేసిన తీర్మాన ప్రతిపాదన మేరకు స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. జగదీష్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేసే విషయాన్ని ఎథిక్స్ కమిటీకి సిఫారసు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. దళిత వర్గానికి చెందిన స్పీకర్ పై ఈ రకంగా ఓ శాసన సభ్యుడు అనుచిత మాట్లాడటం తీవ్ర అభ్యంతరకరమని భట్టి మండిపడ్డారు. మంత్రులు ఉత్తమ్, సీతక్కలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైతం జగదీష్ రెడ్డి వ్యాఖ్యలను తప్పుబడుతూ ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అండర్ రూల్1 , సబ్ రూల్ 2, అలాగే 340నిబంధనల మేరకు సస్పెన్షన్ ప్రతిపాదనలు చేసినట్లుగా స్పీకర్ వెల్లడించారు.

స్పీకర్ నిర్ణయం పట్ల బీఆర్ఎస్ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ సభలో నినాదాలు చేస్తూ సభా వ్యవహారాలను అడ్డుకున్నారు. అనంతరం సభ నుంచి బయటకు వెళ్లి నెక్లెస్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ధ నిరసనకు దిగారు.
అంతకుముందు గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానం చర్చలో మాట్లాడే క్రమంలో స్పీకర్ ను ఉద్దేశించి మా అందరి తరుపునా మీరు అక్కడ పెద్ధమనిషిగా కూర్చున్నారే తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు అని వ్యాఖ్యానించారు. అదే సమయంలో తన ప్రసంగానికి అడ్డు తగిలిన కాంగ్రెస్ సభ్యులను మూసుకోండని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలను రికార్డులలో పరిశీలించాక మంత్రి శ్రీధర్ బాబు సభలో జగదీష్ రెడ్డి సస్పెన్షన్ పై ప్రతిపాదన చేశారు.

Exit mobile version