Congress | కాంగ్రెస్ నేతల ఫ్లెక్సీ వార్.. గాంధీ భవన్‌లో సూర్యాపేట నాయకుల పంచాయితీ

మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతితో ఖాళీయైన సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ పదవి కోసం పార్టీ నేతల మధ్య పంచాయితీ షురూ అయింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, దివంగత దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డిలు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవిని ఆశిస్తున్నారు.

flex war in congress party

flex war in congress party

విధాత, హైదరాబాద్ : మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి మృతితో ఖాళీయైన సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ పదవి కోసం పార్టీ నేతల మధ్య పంచాయితీ షురూ అయింది. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, దివంగత దామోదర్ రెడ్డి తనయుడు సర్వోత్తమ్ రెడ్డిలు పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ పదవిని ఆశిస్తున్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు తాను దామోదర్ రెడ్డి కోసం ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ వదిలేసుకోవాల్సి వచ్చిందన్నారు. మరోవైపు ఇప్పటికైన తనకు నియోజకవర్గ పార్టీ ఇన్‌ఛార్జ్ పదవి ఇవ్వాలని పటేల్ రమేశ్ రెడ్డి కోరుతున్నారు.

అయితే నియోజకవర్గం పార్టీపై తమ కుటుంబం పట్టు కోల్పోకుండా ఇన్‌ఛార్జ్ పదవిని సర్వోత్తమ్ రెడ్డి ఆశిస్తున్నారు. ఇప్పుడు ఇన్‌ఛార్జ్ పదవి దక్కితేనే వచ్చే ఎన్నికల్లో టికెట్ రేసులో ఉండవచ్చని ఇరువురు నేతలు భావిస్తుండటంతో పార్టీ నియోజకవర్గం ఇన్‌ఛార్జ్ పదవి కోసం పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో పటేల్ రమేశ్ రెడ్డి, సర్వోత్తమ్ రెడ్డిల మద్ధతు దారులు గాంధీభవన్ వద్ద పోటాపోటీగా ఇన్‌ఛార్జ్ పదవి కోసం ఫ్లెక్సీ లు ఏర్పాటు చేశారు.

రెండుసార్లు ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు త్యాగం చేసిన పటేల్ రమేశ్ రెడ్డికి సూర్యాపేట నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పదవి ఇవ్వాలని ఆయన మద్దతు దారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అటు కాంగ్రెస్ పార్టీకి దామన్న చాలా చేశారని..ఇప్పుడు పార్టీ దామన్నకు చేయాల్సిన సమయం వచ్చిందంటూ సర్వోత్తమ్ రెడ్డి మద్దతు దారులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గాంధీభవన్ సాక్షిగా సూర్యాపేట నియోజకవర్గం పార్టీ ఇన్‌ఛార్జ్ పదవి కోసం ఇరువురి నేతల ఫ్లెక్సీ వార్ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్ గా మారింది.