Gorantla Butchaiah Chowdary : కేసీఆర్ పై మాజీ మంత్రి గోరంట్ల ఫైర్

చంద్రబాబుపై ఏడవడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులే అసలు కారణమన్నారు.

Gorantla Butchaiah Chowdary

అమరావతి : అధికారం పోయినప్పుడల్లా చంద్రబాబు మీద పడి ఏడవడం బీఆర్ఎస్ కి, కేసీఆర్ కు బాగా అలవాటుగా మారిపోయిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మండిపడ్డారు. కేసీఆర్ రాజకీయాల్లో, టీడీపీలో మా అందరి కంటే జూనియర్ అని, ఆయన రాజకీయంగా పెరిగింది టీడీపీలో కాదా? అని గుర్తు చేశారు. ఆనాడు కేసీఆర్ కు కాకుండా విజయరామారావుకి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చారన్న అక్కసుతో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు చేశాడని గోరంట్ల ఆరోపించారు. కేసీఆర్ పైన, కుటుంబ సభ్యులపైన కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ వంటి పలు అక్రమాల కేసుల్లో అన్నీ విచారణలు జరుగుతున్నాయని..అవన్ని తట్టుకోలేక సీఎం చంద్రబాబు మీద ఏడుస్తున్నాడని విమర్శించారు. తెలంగాణలో అనుమతి ఉన్నంతవరకు ప్రాజెక్టులు కట్టుకోవచ్చని ఎవరు వద్దన్నారని వ్యాఖ్యానించారు. మేం ఏడ్వలేం మీరు ఏడవ వద్దన్నట్లుగా కేసీఆర్ తీరు ఉందన్నారు. మేం పోలవరం పూర్తయ్యేదాకా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా నీళ్లు తీసుకునే ప్రయత్నం చేశామని, కృష్ణా నీటిని వినియోగించుకునే ప్రయత్నం చేశామని తెలిపారు.

సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని వాడుకుంటే తప్పేంటి?

దిగువ రాష్ట్రమైన ఏపీ సముద్రంలో వృధాగా కలుస్తున్న నీటిని వాడుకునేందుకు ప్రాజెక్టులు కట్టుకునే ప్రయత్నం చేస్తుందని గోరంట్ల తెలిపారు. గోదావరిలో 3వేల పైచిలుకు టీఎంసీలు వృధాగా పోతున్నాయని, వాటిలో 250టీఎంసీలు వాడుకునే ప్రయత్నం చేస్తున్నామని..సముద్రంలోకి కలిసిపోయే నీటిని వాడుకుంటే తప్పేంటి? అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో నీటి పారుదల రంగంలో దోపిడీ జరిగిందని ఆ రాష్ట్రంలోనే గగ్గోలు పెడుతున్నారని..దాంతో మాకేంటి సంబంధం అన్నారు. కేసీఆర్, కేటీఆర్ తప్పుడు విధానాలతో వెళ్తున్నారని, ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కేసీఆర్ కృషి చేయకుండా మోకాలడ్డారని ఆరోపించారు. జగన్ తో కలిసి ఏపీలో టీడీపీ లేకుండా చేయాలన్న లక్ష్యంతో పనిచేశారని గోరంట్ల విమర్శించారు. ఇవ్వాళ కేంద్ర రాష్ట్రాల సహకారంతో ఉమ్మడి రాష్ట్రంలో సమస్యల పరిష్కారానికి కృషి జరుగుతుందన్నారు.

ఇవి కూడా చదవండి :

Krishna Water Dispute | కృష్ణా జలాలపై తెలంగాణకు బీఆరెస్‌ది ద్రోహం, కాంగ్రెస్‌ది నిర్లక్ష్యం!
Telangana Government : ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్..పెండింగ్ బిల్లులు రూ.713 కోట్లు విడుదల

Latest News