Site icon vidhaatha

Gulzar House fire accident: గుల్జార్ హౌస్ అగ్నిప్రమాదానికి అసలు కారణమిదే..

Gulzar House fire accident:

గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్ లో వరసగా అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని.. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతాయని తెలిసినా చర్యలు తీసుకోవడం ఫెయిల్ అయ్యిందని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ అగ్ని ప్రమాద ఘటనపై ఫైర్ డిమార్ట్ మెంట్ డీజీ నాగిరెడ్డి స్పందించారు.

అగ్నిప్రమాదం ఎలా జరిగిందో వివరించారు. ఆదివారం తెల్లవారుజామున 6.16 గంటలకు గుల్జార్ హౌస్ చౌరస్తాలోని జి+2 భవనంలో మంటలు చెలరేగాయని చెప్పారు. షార్ట్ సర్క్యూట్ వల్లే మంటలు వ్యాపించాయని వివరించారు. ఇంట్లో మొత్తం చెక్కతో చేసిన ప్యానెళ్లు ఉండటం వల్లే మంటలు విస్తరించాయన్నారు. చెక్క మొత్తం కాలి మంటలు వచ్చాయని చెప్పారు.

వెంటనే స్పందించాం..

సమాచారం అందిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నదని వివరించారు. భవనంలో గ్రౌండ్ + 2 అంతస్తులు ఉన్నాయని వెల్లడించారు. కింది అంతస్తులో మంటలు చెలరేగి.. పై అంతస్తులకు వ్యాపించాయన్నారు. మంటల్లో చిక్కుకకున్న 17 మందిని తాము ఆస్పత్రికి తరలించామని చెప్పారు. నిచ్చెన ద్వారా నలుగురు పైనుంచి కిందికు వచ్చారన్నారు. భవనంలో నిత్యం విద్యుత్ సమస్యలు వస్తున్నాయని స్థానికులు చెబుతున్నారని పేర్కొన్నారు.

అయితే భవన యజమానులు అగ్ని ప్రమాద నివారణకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని పేర్కొన్నారు. 11 ఫైర్ వాహనాలు, ఒక ఫైర్ ఫైటింగ్ రోబోట్, 17 మంది అగ్నిమాపక అధికారులు.. 70 మంది సిబ్బంది రెస్క్యూలో పాల్గొన్నారని వివరించారు. మంటలను ఆర్పేందుకు 2 గంటల సమయం పట్టిందని వివరించారు. మరోవైపు ఆంబులెన్స్ లు సకాలంలో రాకపోవడం వల్లే ప్రాణనష్టం ఎక్కువగా జరిగిందని బాధితులు ఆరోపిస్తున్నారు.

Exit mobile version