హైదరాబాద్, ఆగస్ట్ 23 (విధాత):
Hyderabad 4 Greater Corporations | హైదరాబాద్ మహానగరాన్ని నాలుగు గ్రేటర్ కార్పొరేషన్లుగా విభజిస్తామని గతేడాది ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలక మండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరితో ముగుస్తోంది. ఆ తరువాత జీహెచ్ఎంసీ పరిధిని ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) వరకు విస్తరించడంతో పాటు కార్పొరేషన్లను విలీనం చేయనున్నారు. విలీనం తరువాత నాలుగు గ్రేటర్ కార్పొరేషన్లు చేయాలా? లేక రెండింటితో సరిపెట్టాలా? అనేదానిపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్నది. నాలుగుగా విభజిస్తే పాతబస్తీ పరిధి వరకు ఒక కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందని అంచనా. స్థానిక పరిస్థితులు, రాజకీయ ఆధిపత్యం కారణంగా ఆ ప్రాంతాన్ని ప్రధాన జనజీవన స్రవంతి నుంచి మినహాయించాల్సి ఉంటుందని అంటున్నారు.
తిరోగమనమా… పురోగమనమా
ఒకప్పుడు హైదరాబాద్‌లో ఎంసీహెచ్ మాత్రమే ఉండేది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రేటర్ హైదరాబాద్‌గా హోదా పెంచారు. శివారు ప్రాంతాల్లోని 12 మునిసిపాలిటీలను, 8 గ్రామ పంచాయతీలను విలీనం చేశారు. పటాన్‌చెరును విలీనం చేసిన ప్రభుత్వం, ఆ దారిలో ఉన్న నిజాంపేటను విలీనం చేయలేదు. ఫలితంగా ఆ ప్రాంతమంతా ఇరుకిరుకు రోడ్లు, భారీ భవనాలతో అత్యంత రద్ధీ ప్రాంతంగా తయారైంది. దీన్ని మిడిల్ క్లాస్ మురికివాడగా పిలుస్తుంటారు. పరిధి పెరిగితే అన్ని రంగాల్లో సమాంతరంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి సాధిస్తుందని అప్పట్లో ప్రభుత్వ పెద్దలు ప్రకటనలు గుప్పించారు. అయితే పెరిగిన పరిధికి అనుగుణంగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించకపోవడంతో నగరంలో ఎక్కడికక్కడ సమస్యలు తిష్ఠవేశాయి.
నాలుగు ముక్కలా? రెండు ముక్కలా?
675 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న జీహెచ్ఎంసీలో ఓఆర్ఆర్ లోపల ఉన్న కార్పొరేషన్లను విలీనం చేయాలనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. అందుకు అనుగుణంగానే గ్రామ పంచాయతీలు, మునిసిపాలిటీలను కార్పొరేషన్ స్థాయికి పెంచి గత ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వీటి పాలక మండలి పదవీ కాలం ముగియడంతో ప్రస్తుతం స్పెషల్ ఆఫీసర్ పాలన నడుస్తోంది. జీహెచ్ఎంసీ పాలక మండలి పదవీకాలం ముగిసే వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. ఆ తరువాత అన్నింటిని కలిపి ఒకటే గ్రేటర్ కార్పొరేషన్ చేయాలా? నాలుగుగా విభజించాలా? అన్నది ప్రభుత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఒకప్పుడు శివారులోని మునిసిపాలిటీలను కలిపి పరిధి పెంచారు. దీనివల్ల ప్రజలకు పౌర సేవలు సకాలంలో అందుతాయని, ప్రణాళిక ప్రకారం అభివృద్ధి జరుగుతుంది చెప్పారు. ఇప్పుడేమో ఓఆర్ఆర్ లోపలి వరకు నాలుగు ముక్కలు చేయాలనే యోచనలో ప్రభుత్వ పెద్దలు ఉన్నట్టు తెలుస్తున్నది. నాలుగు భాగాలు చేయదలిస్తే.. నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్‌గా విభజించనున్నట్లు తెలుస్తోంది. లేదు లేదు రెండుగా విభజించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. పొరుగున్న ఉన్న బెంగళూరులో ప్రస్తుతం బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఉంది. దీన్ని ఐదు కార్పొరేషన్లుగా విభజించాలని బ్రాండ్ బెంగళూరు కమిటీ గతేడాది ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీనిపై ముందుకు వెళ్లాలని అక్కడి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ భావిస్తుండగా, ఎట్టిపరిస్థితుల్లో విభజించవద్దని బీజేపీ, జనతాదళ్ (ఎస్) పట్టుబడుతున్నాయి. ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇదిలా ఉండగా ఒకటి చొప్పున ముంబై, ఢిల్లీ, చెన్నై, లక్నో, కోల్‌కతాలో కార్పొరేషన్లు ఉన్నాయి.
నాలుగు అయితే మున్ముందు కష్టాలేనా!
ఓఆర్ఆర్ పరిధి లోపల నాలుగు గ్రేటర్ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తే, సౌత్‌ను పూర్తిగా మర్చిపోవాల్సి ఉంటుందనే అభిప్రాయాలు ఉన్నాయి. అక్కడ పరిపాలన ఒక పార్టీ, వర్గం చేతుల్లోకి వెళ్తుంది. ఫలితంగా నగరానికి ఒక సమస్యగా పరిణమించే ప్రమాదముందని పట్టణ ప్రణాళిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. శాంతి భద్రతలు చేయిదాటే అంశాన్ని కూడా మర్చిపోవద్దని అంటున్నారు. ఇదిలా ఉంటే నాలుగు కార్పొరేషన్లలో వేర్వేరు పార్టీలు గెలుపొందితే ముఖ్యమంత్రి, మంత్రులకు తలనొప్పులు తప్పవు. సౌత్‌లో ఎవరేమి చెప్పినా, ఎంత పోరాడినా ఒక వర్గం పార్టీ నిరంతరం గెలుస్తునే ఉంటుంది. అక్కడ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ గెలుపొందే సూచనలు మచ్చుకు కూడా ఉండవు. ఇక మిగిలిన మూడు గ్రేటర్ కార్పొరేషన్లలో మూడు గెలిస్తే, అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం విభేధాలు ఉంటాయి. ప్రభుత్వంలో ఉన్న పార్టీ మూడింటినీ గెలుపొందితే ఫర్వాలేదని, లేదంటే నిరంతరం రాజకీయంగా సవాళ్లు, ప్రతి సవాళ్లు ఉంటాయని చర్చలు జరుగుతున్నాయి. ఫలితంగా నగర అభివృద్ధిపై ప్రభావం ఉంటుంది. రెండుగా విభజిస్తే ఫర్వాలేదని, పరిస్థితి కొంత మెరుగ్గా ఉంటుందని పట్టణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మహానగరాన్ని పునర్వ్యవస్థీకరణ చేసే ముందు దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లోని గ్రేటర్ కార్పొరేషన్లపై అధ్యయనం చేయాలని అంటున్నారు. ఇందుకోసం నిపుణులతో అధ్యయన కమిటీ వేసి, నివేదిక తయారు చేయిస్తే బాగుంటుదని అభిప్రాయపడుతున్నారు. ఒక్క మునిసిపాలిటీ కాకుండా పోలీసు, రెవెన్యూ, నీటి సరఫరా, మురుగునీటి పారుదలపై అధ్యయనం చేయిస్తే శాస్త్రీయమైన పురోగతికి పునాదులు వేసినవారు అవుతారని చెబుతున్నారు.