విధాత: వైసీపీ పార్టీని 2014-19 వరకు సింగల్ హ్యాండ్ తో నడిపానని, అధికారం వచ్చిన 6 నెలలకే నన్ను 2వ స్థానం నుంచి 2000 స్థానానికి తీసుకెళ్లారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతా జగన్ ఆదేశాలను నేరుగా తీసుకుని ప్రశాంత్ కిషోర్, నేను ఇతర నాయకులను కలుపుకుని పార్టీని ముందుకు తీసుకెళ్లామన్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలలకు నెంబర్ 2 అనేది మిథ్యే అని నేను కూడా గమనించానన్నారు. కోటరీ సభ్యులు అంత నా మీద జగన్ కు లేనిపోనివి చెప్పి నన్ను దూరం చేశారని..వేలకోట్లు దోచుకుంటున్నట్లుగా చిత్రీకరించారని.. నాయకుడి మనసులో నాకు స్థానం లేదని తెలిసి వేదనతోనే నేను పార్టీ వీడటం జరిగిందని స్పష్టం చేశారు. ఇప్పటికీ నాపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
లిక్కర్ పాలసీకి సంబంధించి రాజ్ కసిరెడ్డి రెండు మీటింగులలో పాల్గొన్నట్లు సిట్ కు చెప్పడం జరిగిందని విజయసాయిరెడ్డి చెప్పారు. వాసుదేవ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కసిరెడ్డి, సత్యప్రసాద్ మీటింగ్ లో పాల్గొన్నారని.. కిక్ బ్యాగ్స్ గురించి నాకు తెలియదని చెప్పానని వివరించారు. రాజ్ కసిరెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి, మిథున్ రెడ్డిల కోరిక మేరకు అరబిందో కంపెనీ నుంచి రూ. 100 కోట్లను రాజ్ కసిరెడ్డి చెప్పిన రెండు కంపెనీలలో ఒకదానికి రూ.60 కోట్లు, మరొదానికి రూ.40 కోట్లు రుణం మాత్రమే ఇప్పించేలా తాను సిఫార్సు చేయడం జరిగిందని తెలిపారు. అయితే నిధుల వినియోగం గురించి తెలియదని చెప్పానని చెప్పారు. లిక్కర్ సేల్స్ విషయంలో మొదటి మూడు నెలల తర్వాత తాను జోక్యం చేసుకోలేదని తెలిపానని చెప్పారు. రాజ్ కసిరెడ్డి మాత్రమే వీటన్నింటికి సమాధానం చెప్పగలడని అన్నారు. తాను చెప్పిన సమాధానాలకు అధికారులు సంతృప్తి చెందినట్టుగా భావిస్తున్నానని… అయితే మళ్లీ పిలిస్తే విచారణకు హాజరవుతానని కూడా చెప్పానని తెలిపారు.
రాజ్ కసిరెడ్డి ఒక తెలివైన క్రిమినల్ అని.. పార్టీ పెద్దలు పరిచయం చేస్తేనే రాజ్ కసిరెడ్డిని నేను ఎంకరేజ్ చేశానని.. రాజ్ కసిరెడ్డి నాతో పాటు పార్టీని, ప్రజలను మోసం చేశాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. రాజకీయాల్లోకి రీఎంట్రీ కావాలనుకుంటే నాకు ఎవరి పర్మిషన్ అవసరం లేదన్నారు. ‘నేను రాజకీయాల్లోకి రీఎంట్రీ కావాలంటే… మీ పర్మిషన్ కావాలా?. అది నా ఇష్టం. నేను వ్యవసాయం వదిలేసుకుని… వ్యాపార రంగంలోకి ఎంటర్ అవుతాను… అది నా ఇష్టం. నా గురించి ఏదైనా ఉంటే అది నేనే చెబుతాను’’ అని చెప్పారు. ‘‘ప్రజలు నన్ను పొలిటికల్ రీ ఎంటర్ కావాలని అడుగుతారో.. అప్పుడు తప్పకుండా అవుతాను… నేను రాజ్యసభ రేసులో లేను’’ అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.