Site icon vidhaatha

Jobs: ఈ నైపుణ్యాలుంటే.. లక్షల జీతాలు మీకే!

ప్రస్తుత కాలంలో కొన్ని ఉద్యోగాలకు ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అలాంటి వాటిలో ఉన్నత స్థాయికి చేరే అవకాశం కూడా లభిస్తుంది. 2025లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) నిపుణులు, రిస్క్ విశ్లేషకులు, అభివృద్ధి వ్యూహకర్తలు, నియంత్రణ సమ్మతి నిపుణులు, పబ్లిక్ స్పీకర్లు ఈ జాబితాలో ముందు వరుసలో ఉన్నారు. ఈ వృత్తుల్లో పనిచేసే వారు ఇతరులతో పోలిస్తే అత్యధిక వేతనాలు అందుకుంటున్నారు. అయితే, ఈ రంగాల్లో పోటీతత్వం కూడా తీవ్రంగా ఉంటుంది. ఏఐ అక్షరాస్యత, వాటాదారుల నిర్వహణ, ప్రాసెస్ అప్లికేషన్, గో టు మార్కెట్ వంటి నైపుణ్యాలను సమర్థవంతంగా అందిపుచ్చుకోవాలి.

ఈ సామర్థ్యాలను మెరుగుపరచుకుంటే ఉద్యోగంలో ఉన్నత స్థానం సాధించడంతోపాటు గణనీయమైన ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇటీవలి నివేదికల ప్రకారం, కంపెనీల యజమానులు తమ ఉద్యోగుల నుంచి కొన్ని కీలక నైపుణ్యాలను ఆశిస్తున్నారు. ఈ నైపుణ్యాలు కలిగిన వారికి ఎక్కువ వేతనం అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ఏఐ సామర్థ్యాలు, సంఘర్షణ పరిష్కారం, అనుకూలత, వర్క్ ఫ్లో ఆప్టిమైజేషన్, వినూత్న ఆలోచనలు, పబ్లిక్ స్పీకింగ్ వంటివి ఈ జాబితాలో ఉన్నాయి. అంతేకాకుండా, కస్టమర్ ఎంగేజ్‌మెంట్, వాటాదారుల నిర్వహణ, లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఎల్ఎం), వనరుల నిర్వహణ, జీటీఎం వ్యూహాలు వంటి అంశాల్లో పట్టు కోరుకుంటున్నారు.

ఏఐకి డిమాండ్..

ప్రపంచవ్యాప్తంగా ఏఐ శరవేగంగా విస్తరిస్తోంది. సమస్యలకు త్వరిత పరిష్కారాలు చూపుతూ అన్ని రంగాల్లో ప్రభావం చూపుతోంది. ఈ సాంకేతికతను తమ పనిలో సమర్థవంతంగా అనుసంధానం చేయగల నిపుణులకు డిమాండ్ గణనీయంగా పెరుగుతోంది. సాధారణ అర్హతలతోపాటు ఏఐ నైపుణ్యం ఉన్నవారికి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. అనుభవం తక్కువ ఉన్నప్పటికీ, ఈ నైపుణ్యాలు కలిగిన వారికి 47 శాతం అధిక వేతనం లభిస్తుందని ఒక నివేదిక తెలిపింది. వ్యాపారాలు కొత్త ఉత్పత్తులతో వేగంగా ముందుకు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఆవిష్కరణలు అత్యవసరంగా మారాయి. బాధ్యతాయుతంగా ఆవిష్కరణలు చేయగల, దీర్ఘకాలిక విజయాలను అందించగల నిపుణుల కోసం కంపెనీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

సాంకేతిక నైపుణ్యాలతోపాటు సాఫ్ట్ స్కిల్స్ కలిగిన ఉద్యోగులకు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. సమర్థవంతమైన చర్చలు, విభేదాల పరిష్కారం, వాటాదారుల నిర్వహణ, ఆలోచనల స్పష్టమైన కమ్యూనికేషన్ వంటి సామర్థ్యాలు కలిగిన వారిని కంపెనీలు ఆహ్వానిస్తున్నాయి. పబ్లిక్ స్పీకింగ్ కూడా పరిశ్రమ అభివృద్ధికి కీలకంగా మారుతోంది. నాయకత్వ లక్షణాలను పెంచడం, ఉత్పత్తి అమ్మకాల నిర్వహణలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగిన ఫ్రీలాన్సర్లకు కూడా అనేక ప్రయోజనాలు లభిస్తాయి. పరిశ్రమతో సంబంధం లేకుండా టెక్నాలజీ, మార్కెటింగ్, ఫైనాన్స్, కన్సల్టింగ్, డిజైన్ వంటి నైపుణ్యాలను మెరుగుపరచుకోవడం ద్వారా ఉద్యోగులకు కొత్త అవకాశాలు అందుబాటులోకి వస్తాయి.

Exit mobile version