Minister Ponnam Prabhakar |ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో నమ్మకం పెంచేలా వైద్య సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని రాష్ట్ర రవాణా, సంక్షేమ శాఖ మంత్రి, హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. శుక్రవారం చింతల్ బస్తీ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, యునానీ హాస్పిటళ్లను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. అటెండెన్స్ రిజిస్టర్, ల్యాబ్, మెడిసిన్ స్టోర్, వాటి రికార్డులు, వైద్య సిబ్బంది వివరాలను పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. విధులకు హాజరుకాని ఏఎన్ఎంలపై చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను మంత్రి పొన్నం ఆదేశించారు.
క్షేత్ర స్థాయిలో ఉన్న ఏఎన్ఎంలకు ఫోన్ చేసి ఎక్కడున్నారు? ఏ వీధిలో వైద్య సేవలు అందిస్తున్నారు? అని అడిగి, ఆ ఇంటి యజమానితో మాట్లాడించాలని మంత్రి సూచించారు. వారు సత్వరమే స్పందించి ఏఎన్ఎంలు ఉన్న ఇంటి యజమానితో మాట్లాడించారు. వారితో మంత్రి పొన్నం మాట్లాడుతూ వైద్య సేవలు సరిగా అందిస్తున్నారా లేదా అంటూ పలు ప్రశ్నలు వేసి వివరాలు తెలుసుకున్నారు. ఆస్పత్రులు, పాఠశాలలు, హాస్టల్స్, శానిటేషన్ పై జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్, తాను ఆకస్మికంగా తనిఖీలు చేస్తామని తెలిపారు.
జిల్లాలోని ఏరియా ఆసుపత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మందులు కొరత లేకుండా చూడాలని అలాగే వైద్య అధికారులు, ఏఎన్ఎం లు క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టాలని మంత్రి ఆదేశించారు. ఏమైనా సమస్యలు ఉంటే స్థానిక అధికారుల దృష్టికి తేవాలని సూచించారు. వైద్యశాలకు వచ్చే రోగులకు చికిత్స అనంతరం మెడిసిన్ అందించాలని చెప్పారు. గర్భిణీలు, బాలింతలు, వృద్ధులకు కచ్చితంగా మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.