Site icon vidhaatha

పాక్‌తో క్రికెట్, సినిమాలపై.. భారత్ నిషేధం!

విధాత : జమ్మూ కాశ్మీర్‎లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న భారత్ శతృదేశం పాకిస్థాన్‎పై కఠిన చర్యలకు ఉపక్రమిస్తుంది. 26 మంది అమాయక ప్రజల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ఉగ్రవాదులకు మద్దతుగా నిలిచిన దాయాది దేశానికి తగిన విధంగా బుద్ధి చెప్పేందుకు ఇప్పటికే పలు ఆంక్షలు విధించింది. 1960 సింధు నది జలాల ఒప్పందాన్ని రద్దు చేసి పాక్ గొంతు ఎండబెడుతున్న భారత్.. అటారీ వాఘాలోని ఇంటిగ్రేటెడ్ చెక్‌పోస్ట్ కూడా మూసివేసింది. 48 గంటల్లో పాక్ పౌరులు భారత్ విడిచిపోవాలని ఆదేశించింది. అలాగే.. వారం రోజుల్లో ఢిల్లీలోని పాక్ హై కమిషనర్ కార్యాలయం ఖాళీ చేయాలని సంబంధిత అధికారులకు సమన్లు జారీ చేసింది.

ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‎లో పాక్ సినిమాలు, ఆ దేశ నటులపై నిషేధం విధించింది. ఇందులో భాగంగా పాక్ హీరో ఫవాద్ ఖాన్, భారత నటి వాణి కపూర్ నటించిన అబిర్ గులాల్ సినిమాపై బ్యాన్ విధించింది. 2025, మే 9న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విడుదలకు అనుమతి నిరాకరించింది. ఈ మేరకు భారత కేంద్ర సమాచార మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇప్పటి నుంచి భారత్‎లో పాక్ సినిమాలు ప్రదర్శించబడవు. అలాగే.. పాక్ యాక్టర్స్ నటించిన సినిమాలు కూడా భారత్‎లో రిలీజ్ కావు. సీమాంతరం ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తోన్న పాకిస్థాన్ పై భారత్ ఒక్కొక్కటిగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశాన్ని కకాలవికలం చేస్తున్నాయి.

పాక్ తో ద్వైపాక్షిక క్రికెట్ ఆడబోం: BCCI కీలక నిర్ణయం

పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ తో ఇక నుంచి ద్వైపాక్షిక క్రికెట్ మ్యాచులు ఆడేది లేదని స్పష్టం చేసింది. భారత ప్రభుత్వం ఏం చెబితే మేం దానినే అనుసరిస్తామని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. తటస్థ వేదికలపైన కూడా పాక్ తో మ్యాచ్ లు ఆడేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పింది. భారత్ చివరిసారిగా 2008లో పాకిస్తాన్ దేశం వెళ్లి.. అక్కడ మ్యాచ్ లు ఆడింది.

ఆ తర్వాత రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరుగలేదు. ఐసీసీ వరల్డ్ కప్ లాంటి మ్యాచుల కోసం తటస్థ దేశాల్లోపాక్ తో ఆడుతూ వచ్చింది. ఇక నుంచి పాకిస్తాన్ తో ఎలాంటి మ్యాచులు ఆడకూడదని బీసీసీఐ నిర్ణయించింది. పాకిస్తాన్ ఎలాంటి దేశమో ఐసీసీకి కూడా తెలుసు అని బీసీసీఐ పేర్కొంది. ఐసీసీ సిరీస్ విషయంలో ఆయా సందర్భాన్ని బట్టి.. ప్రభుత్వం నిర్ణయం ఆధారంగా పాకిస్తాన్ తో క్రికెట్ మ్యాచ్ ఆడాలా వద్దా అనేది నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ వెల్లడించింది.

Exit mobile version