FIBEU | తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇండియన్ బ్యాంక్ ఉద్యోగులు శుక్రవారం హైదరాబాద్‌లోని లిబర్టీ ప్లాజాలో ఉన్న ఇండియన్ బ్యాంక్ ఫీల్డ్ జనరల్ మేనేజర్, జోనల్ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్స్ (ఎఫ్ఐబిఇయు) పిలుపు మేరకు హైదరాబాద్ జంట నగరాల్లో పనిచేస్తున్న ఇండియన్ బ్యాంక్ వందల మంది ఉద్యోగులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇండియన్ బ్యాంక్ లో ఉన్న సాధారణ ఖాళీలలో క్లరికల్ స్టాఫ్, సబ్-స్టాఫ్, స్వీపర్లు, డ్రైవర్లను తగినంతగా నియమించాలని, అలహాబాద్ బ్యాంక్‌ను ఇండియన్ బ్యాంక్‌లో విలీనం చేసిన తర్వాత ఉద్యోగులకు ఇంటిగ్రేటెడ్ ట్రాన్సఫర్ పాలసీని, పెండింగ్ ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేట్టాలని, బ్యాంకులో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులకు కనీస వేతనాలు, బోనస్ చెల్లించాలని, బ్యాంకులో ఉన్న శాశ్వత ఖాళీలలో తాత్కాలిక ఉద్యోగుల సేవలను క్రమబద్ధీకరించాలని వారు డిమాండ్ చేశారు.
ఉద్యోగులను ఉద్దేశించి ఎఫ్ఐబిఇయు సెక్రటరీ జనరల్ ఈ అరుణాచలం మాట్లాడుతూ 1997-2000 మధ్య కాలంలో బ్యాంక్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఇండియన్ బ్యాంక్ నియామకాలపై నిషేధం విధించారని చెప్పారు. సిబ్బంది, అధికారుల సహకారంతో బ్యాంక్ వేగవంతమైన పురోగతిని సాధించిందని అన్నారు. గత రెండు దశాబ్దాలుగా అపారమైన లాభాలను కూడా ఆర్జించిందన్నారు. అయినప్పటికీ సబ్ స్టాఫ్, స్వీపర్ల నియామకం పూర్తిగా జరగలేదని, బ్యాంకు కొంతవరకు క్లరికల్ సిబ్బందిని నియమిస్తున్నప్పటికీ, శాఖలలో వృద్ధి, వ్యాపారం, పని ఒత్తిడితో పోలిస్తే ఇది సరిపోదన్నారు. ఇప్పటికీ అనేక శాఖలు తక్కువ సిబ్బందితో కొనసాగుతున్నాయన్నారు. సేవలు ఆలస్యం కావడం పట్ల కస్టమర్లు కౌంటర్ సిబ్బందిని దుర్భాషలాడుతున్నారన్నారు. క్లరికల్, సబ్-స్టాఫ్, సెక్యూరిటీ గార్డ్, డ్రైవర్లు, స్వీపర్స్ వంటి అన్ని కేడర్లలో అవార్డు సిబ్బందిని తగినంతగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. అలహాబాద్ బ్యాంక్ ఇండియన్ బ్యాంక్ విలీనం చేసి ఐదేళ్లు గడిచినా ఉద్యోగులకు అవార్డు కోసం ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్ పాలసీపై సంతకం చేయడంలో యాజమాన్యం ఆలస్యం చేస్తోందని విమర్శించారు. బ్యాంక్ కారుణ్య నియామకం కోసం మరణించిన సిబ్బంది కుటుంబ సభ్యుల అనేక దరఖాస్తులు యాజమాన్యం వద్ద పెండింగ్ ఉన్నాయని, ఆ దరఖాస్తులను పరిశీలించి వెంటనే నియామకాలు చేపట్టాలని కోరారు. అనేక ఏళ్లుగా యాజమాన్యం వద్ద పెండింగ్ ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.
అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ (ఎ ఐ బి ఇ ఎ) జాతీయ కార్యదర్శి బి.ఎస్.రాంబాబు మాట్లాడుతూ ఇటీవల హైదరాబాద్ ఎ ఐ బి ఇ ఎ జాతీయ కార్యవర్గ సమావేశం జరిగిందని, బ్యాంకింగ్ రంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను చర్చించామని, ఆ సమస్యలను ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించిందని చెప్పారు. ఇండియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ (ఎపి, టిఎస్) జనరల్ సెక్రటరీ పి.వి.కృష్ణారావు మాట్లాడుతూ మార్చి 4వ తేదీన ఫరీదాబాద్ సమావేశమై, చర్చల సమయంలో నిర్ణయించిన 54 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ చేస్తూ ఆందోళన కార్యక్రమాన్ని ప్రారంభించాలని నిర్ణయించిందన్నారు. ఈ మేరకు సమ్మె డిమాండ్ అన్నింటినీ ప్రస్తావిస్తూ అన్ని శాఖల నుండి ఇండియన్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్, సిఇఓకు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించినట్లు తెలిపారు. పెండింగ్ ఉన్న అన్ని సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 19న అన్ని జోనల్, ఎఫ్.జి.ఏం కార్యాలయాల ముందు ధర్నాను, చివరకు ఏప్రిల్ 25న ఒక రోజు సమ్మె నిర్వహించనున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో ఉద్యోగ నియామకాలను కోరుతూ మరిన్ని సమ్మెలకు సిద్ధంగా ఉండాలని ఆయన సిబ్బందికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి యూనియన్ అధ్యక్షుడు ఎం.ఎస్.కుమార్ అధ్యక్షత వహించగా, యూనియన్ జాయింట్ జనరల్ సెక్రటరీ జి.నల్లప్ప రెడ్డి, మహిళా కౌన్సిల్ కన్వీనర్ జి.పద్మ తదితరులు పాల్గొన్నారు.