Site icon vidhaatha

Kaleshwaram Controversy : కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు చేస్తుంది..నిరసనలకు కేటీఆర్ పిలుపు

KTR

Kaleshwaram Controversy | విధాత, హైదరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టుపైన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలను, సీబీఐ విచారణ నిర్ణయాన్ని నిరసిస్తూ ఈరోజు, రేపు రెండు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. పార్టీ శ్రేణులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కేటీఆర్ సోమ, మంగళవారాల్లో మండల కేంద్రాల్లో వివిధ రూపాల్లో నిరసన తెలపాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరంపైన కుట్ర చేస్తుందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసేసి నదీ జలాలను ఆంధ్రకు తరలించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని..బీజేపీ-కాంగ్రెస్ కలిసి చేస్తున్న ఈ కుట్రలను ఎదుర్కోవాలన్నారు. ఇది కేసీఆర్ పైన చేస్తున్న కుట్ర మాత్రమే కాదు.. తెలంగాణ నదీ జలాలను పక్క రాష్ట్రాలకు తరలించి, కాళేశ్వరాన్ని ఎండబెట్టే ప్రయత్నంలో భాగంగానే జరుగుతుందన్నారు.

సీబీఐకి కాళేశ్వరం అప్పజెప్పడం అంటే పూర్తిగా ప్రాజెక్టును మూసేయడమేనని విమర్శించారు. నిన్నటిదాకా సీబీఐ పైన వ్యతిరేకంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఒక్కరోజులోనే మాట ఎందుకు మార్చాడు? అని ప్రశ్నించారు. దీని వెనుక ఉన్న శక్తులు వాటి ఉద్దేశాలు ఏమిటో ప్రజలకు తెలియజెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
ఇది కచ్చితంగా కాంగ్రెస్చ బీజేపీ ఆడుతున్న నాటకం, వాళ్ళు చేస్తున్న కుట్రనే అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ కాళేశ్వరం విచారణను సీబీఐకి ఇచ్చినా.. ఏ ఏజెన్సీకి ఇచ్చినా భయపడేది లేదన్నారు. కేంద్రంతో కలిసి కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను ఎదుర్కొంటాం అని..బెదిరింపులు కేసులు మా పార్టీకి కొత్త కాదు అని, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎన్ని పోరాటాలైన త్యాగాలైనా చేస్తాం అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Exit mobile version