విధాత: పొరపాటున పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి పాక్ సైన్యానికి చిక్కిన భారత్ జవాను పూర్ణం సాహు క్షేమంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సాహూ విడుదల కోసం రెండు దేశాల భద్రతా దళాలు చర్చలు జరిపాయి. అంతలోనే పహల్గావ్ ఉగ్రదాడి ఘటన చోటు చేసుకోవడం.. భారత్ పాక్ మధ్య ఉద్రికత్తలు నెలకొనడంతో ఇప్పుడు సాహు పరిస్థితిపై తీవ్ర గందరగోళం ఏర్పడింది. బీఎస్‌ఎఫ్ 182వ బెటాలియన్ జవాను అయిన పూర్ణం సాహు పంజాబ్‌లోని ఫిరోజ్‌పుర్ సెక్టార్ లో విధులు నిర్వర్తిస్తున్నారు.సెలవు ముగించుకుని మూడు వారాల క్రితమే తిరిగి విధుల్లో చేరాడు.
బుధవారం సరిహద్దు వద్ద కొంతమంది రైతులకు రక్షణగా గస్తీ కాస్తుండగా ఆయన కొంత అస్వస్థతకు గురయ్యాడు. సమీపంలో ఓ చెట్టు కనబడటంతో దాని కింద విశ్రాంతి తీసుకున్నారు. అయితే, అది పాక్ భూభాగం అన్న విషయాన్ని గుర్తించలేక పోయారు. సరిహద్దు దాటి రావడంతో పాకిస్థాన్ రేంజర్స్ ఆయనను కస్టడీలోకి తీసుకున్నారు. సాహు విడుదల కోసం రెండు దేశాల భద్రతా దళాల అధికారుల చర్చలు పురోగతిలో ఉండగానే.. పహల్గామ్ ఘటనతో దాయాది దేశంతో ఉద్రిక్తతలు రేగాయి. పహల్గామ్ ఘటనతో మా బిడ్డ పరిస్థితి ఎలా ఉందో తెలియడం లేదని.. బతికున్నాడా? లేదో కూడా సమాచారం లేదని జవాను తండ్రి భోల్‌నాథ్ సాహూ, జవాన్ భార్య, ఎనిమిదేళ్ల కూమారుడు, కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. సాహును ఎలాగైనా ఇంటికి తీసుకురావాలంటూ వారు కేంద్రాన్ని వేడుకుంటున్నారు.