విధాత: నందమూరి నటసింహం, సినీ హీరో బాలకృష్ణ ఐపిఎల్ క్రికెట్ కామెంటేటర్‌గా కొత్త అవతారం ఎత్తబోతున్నాడు. మార్చి 31 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2023 స్టార్ స్పోర్ట్స్ తెలుగు కామెంటేటర్ గా బాలయ్య తెలుగు ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ఐపీల్ ప్రారంభోత్సవం రోజు మ్యాచ్ కామెంటరీ అందించబోతున్నాడు.
సీనియర్ నటుడిగా కోట్లాది మంది ప్రజలను తన నటనతో ఉర్రూతలూగించిన బాలయ్య బాబు ఆహా టాక్ షో హోస్ట్ గా తనదైన శైలిలో పంచ్‌లతో, కామెడీతో, భావోద్వేగాలను రంగరిస్తూ ఓటీటీ అభిమానుల మనసును సైతం చూరగొన్నాడు. ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించాడు.
మొదటి నుంచి వ్యాపార ప్రకటనలకు సైతం దూరంగా ఉన్న బాలయ్య ఇటీవల పలు జ్యువెలరీ, డైమండ్స్ యాడ్ లోను సరికొత్తగా ఆకట్టుకున్నాడు. కాగా ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ క్రికెట్ కామెంటేటర్‌గా వ్యవహరించ బోతూ ఇక మీదట క్రీడాభిమానాలను సైతం తన వ్యాఖ్యానంతో షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు.
బాల్యం నుంచి కూడా క్రికెట్ ఆటపై మక్కువ.. ప్రవేశము ఉన్న నటుడు బాలయ్య ఐపీఎల్ క్రికెట్ కామెంటేటర్‌గా విజయవంతం అయ్యే అవకాశాలు మెండుగానే ఉన్నాయి.
బాలయ్య హైదరాబాద్ నిజాం కళాశాలలో చదువుకునే సమయంలో భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజారుద్దీన్, మాజీ సీఎం ఎన్. కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి వంటి తన సహచరులతో కలిసి కళాశాల క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. పలుమార్లు సినీ తారల క్రికెట్ పోటీల్లోనూ గతంలో బాలయ్య తన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించారు.
ఈ నేపథ్యంలో ఐపీఎల్ క్రికెట్ లీగ్ కామెంటేటర్‌గా బాలయ్య తనదైన వ్యాఖ్యానంతో అదరగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది. ఇంకేముంది.. మార్చి 31న ప్రారంభమయ్యే ఐపీఎల్ ఓపెనింగ్ డే రోజు ఎంటర్టైన్మెంట్ వేరే లెవెల్‌లో ఉండబోతుందంటూ స్టార్ స్పోర్ట్స్ చేసిన ట్వీట్ నిజం చేసేలా ధనాధన్ పొట్టి క్రికెట్ ఐపీఎల్‌లో బాలయ్య దబిడి దిబిడే అంటూ తనదైన క్రికెట్ కామెంటరీతో క్రీడాభిమానులకు వినోదం పంచబోతుండటం ఆసక్తి రేపుతుంది.
లెజెండ్ బాలయ్యతో స్టార్ట్స్పోర్ట్స్ తెలుగు
ఇన్క్రెడిబుల్ ప్రీమియర్ లీగ్ ఫస్ట్ డే ఫస్ట్ షోఇక ఆట #UnStoppable