హైదరాద్, సెప్టెంబర్ 13 (విధాత): రాష్ట్రంలో వృత్తివిద్యా కాలేజీల్లో చదువుకునే పేద విద్యార్థుల ఫీజుల రీయింబర్స్‌మెంట్ సమస్య.. అంతిమంగా విద్యార్థుల భవితవ్యాన్నే ప్రశ్నార్థకం చేసేలా కనిపిస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కాలేజీలకు ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద పది వేల కోట్లు బకాయి పడిందని చెబుతున్నారు. వీటిని ఈ నెల 15లోపు చెల్లించకుంటే కాలేజీలను నిరవధికంగా మూసి వేస్తామని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించడం ఇప్పుడు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. అదే జరిగితే కనీసం పది లక్షల మంది విద్యార్థులపై ఆ ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు రూ. 10 వేల కోట్లు
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులు ప్రభుత్వం విడుదల చేసే స్కాలర్‌షిప్‌లపైనే ఆధారపడి చదువుకుంటున్నారు. వృత్తి విద్యా కోర్సులు అందించే కాలేజీలు ప్రభుత్వం విడుదల చేసే ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నాయి. ఏటా ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం రూ. 2,500 వేల కోట్లు అవసరం. విద్యా సంవత్సరం ప్రారంభమైన తర్వాత ఫీజు రీయింబర్స్ మెంట్ కోసం వచ్చిన ధరఖాస్తులను సంక్షేమ శాఖలు పరిశీలించి ట్రెజరీలకు పంపుతాయి. ఆర్థిక శాఖ వద్ద ఈ ఫైల్స్ పెండింగులో ఉంటున్నాయి. బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఆధారంగా ఆర్ధికశాఖ బిల్లులను రిలీజ్ చేస్తోంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు ఈ ఏడాది మే వరకు సుమారు రూ.1,150 కోట్ల విలువైన టోకెన్లు జారీ చేసినా.. వాటికి మోక్షం లభించలేదని కాలేజీ యాజమాన్యాలు అంటున్నాయి. మొత్తం బకాయిలు పదివేల కోట్లకు చేరుకున్నాయని, కనీసం టోకెన్లు జారీ అయిన నిధులను సెప్టెంబర్ చివరి నాటికి రిలీజ్ చేయాలని సమాఖ్య ప్రతినిధులు కోరుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయం నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు.
ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాల నిరసనలు
కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వన్ టైం సెటిల్‌మెంట్ ద్వారా పరిష్కరించాలని చూసింది. అలా చేస్తే కొన్ని కాలేజీలు తమ ఫీజులో కొంత తగ్గించుకోవాల్సి ఉంటుంది. దానితో కాలేజీలు సానుకూలంగా స్పందించలేదు. ప్రభుత్వం కూడా వెనక్కు తగ్గింది. బకాయిలు చెల్లించాలని కోరుతూ 2024 అక్టోబర్ లో డిగ్రీ, పీజీ కాలేజీలను మూసివేసి నిరసన తెలిపారు. ఈ ఏడాది మార్చిలో పరీక్షలు బహిష్కరిస్తామని ప్రకటించారు. తాజాగా ఈ నెల 15 నుంచి కాలేజీలను నిరవధికంగా బంద్ చేస్తామని ప్రకటించారు. బకాయిలు రాకపోవడంతో ఇప్పటికే 166 ఇంటర్, 72 డిగ్రీ, 29 ఇంజనీరింగ్, 47 పారా మెడికల్ కాలేజీలు మూతపడ్డాయని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రకటించింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ బ్యాంకు ప్రతిపాదన
ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల చెల్లింపులో ఇబ్బందులు ఎదురుకాకుండా రూ.1 లక్ష కోట్ల డిపాజిట్లతో ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేయాలని కాలేజీ యాజమాన్యాలు సూచించాయి. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ నిధులు, సీఎస్ఆర్ ఫండ్స్, కార్పస్ ఫండ్ సేకరించాలని ప్రతిపాదించాయి. వాటిని బ్యాంకులో డిపాజిట్ చేస్తే ఏటా రూ. 3 వేల కోట్లు వడ్డీ వస్తుందని, ఆ సొమ్మును రీయింబర్స్‌మెంట్‌కు చెల్లించవచ్చని తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య ప్రతినిధులు ఈ ఏడాది జూలైలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో సమావేశమైన సందర్భంలో ప్రతిపాదించాయి. దీనిపై ఆలోచిస్తామని ప్రభుత్వం తెలిపింది.
విద్యార్థుల ఇబ్బందులు
ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పీజులు చెల్లించాలని విద్యార్థులపై ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు ఒత్తిడి తెస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫైనల్ ఇయర్ విద్యార్థులు తమ సర్టిఫికెట్లను తీసుకోవాలంటే ఆ విద్యాసంస్థల్లో బకాయిలను క్లియర్ చేయాల్సి ఉంటుంది. ఉన్నత చదువుల కోసమో, లేదా ఇతర అవసరాల కోసమో సర్టిఫికెట్లు తీసుకోవాలంటే ఫీజులు క్లియర్ చేయాల్సిన పరిస్థితులు తప్పనిసరి. ఇలా విద్యార్థులు తమ చేతి నుంచి ఫీజులు క్లియర్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. ఫీజులు చెల్లించలేదని కొందరు విద్యార్థులను పరీక్షలకు కూడా హాజరుకాకుండా అడ్డుకుంటున్నారనేది విద్యార్థి సంఘాల ఆరోపణ.