Jaggareddy : సంగారెడ్డి ప్రజలకు కొత్త మంజీరా వాటర్ స్కీమ్

సంగారెడ్డి ప్రజలకు అదనంగా మంజీరా నీరు సరఫరా కోసం రూ.200 కోట్లు, కొత్త ఫిల్టర్ బెడ్, ఇంటెక్ వెల్ నిర్మాణం ప్రతిపాదనలు.

Jaggareddy : సంగారెడ్డి ప్రజలకు కొత్త మంజీరా వాటర్ స్కీమ్

విధాత : సంగారెడ్డి ప్రజలకు సరిపడ నాణ్యమైన మంజీరా నీళ్ళు అదనంగా సరఫరా చేసేందుకు రూ.200 కోట్లతో ప్రతిపాదనలు తయారు చేయాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జగ్గారెడ్డి మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులకు సూచించారు. శుక్రవారం సంగారెడ్డి వాటర్ స్కీమ్ లపై ఆయన ఇరిగేషన్, ఆర్ డబ్ల్యుఎస్ అధికార యంత్రాంగంతో సమీక్ష నిర్వహించారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో ఇప్పుడున్న ఫిల్టర్ బెడ్ కు అదనంగా మరో ఫిల్టర్ బెడ్ , ఇంటెక్ వెల్ నిర్మించాలని ప్రతిపాదించారు. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ పండుగలప్పుడు ఉదయం, సాయంత్రం అదనంగా రెండు గంటల పాటు మంజీరా నీళ్ళు ఇవ్వాలని సూచించారు. అవసరమైన చోట కొత్త డిస్ట్రిబ్యూషన్ లైన్స్, ట్యాంక్ ల నిర్మాణం చేపట్టాలన్నారు. శివారు గ్రామాలైన కల్పగురు, కులబ్ గురు, తాల్లపల్లి, గంజి గూడెం, ఇరుగు పల్లి, కోత్లపూర్, ఫసల్ వాది తదితర గ్రామాల వరకు త్రాగు నీటి సరఫరా ఉండేలా డిజైన్ చేయాలని..రానున్న 50ఏళ్ల వరకు సంగారెడ్డి మున్సిపాలిటీకి ఎలాంటి తాగునీటి ఇబ్బందులు రాకుండా ఉండేలా ప్రణాళికలు తయారు చేయాలని స్పష్టం చేశారు.

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తాను సంగారెడ్డి మున్సిపాలిటీకి ప్రత్యేకంగా మంజీరా వాటర్ స్కీమ్ తెచ్చానని..తెలంగాణ రాష్ట్రంలో మిషన్ భగీరథ ను తెచ్చి మంజీరా వాటర్ స్కీమ్ ను నాశనం చేసి..నీటి సరఫరా కు ఇబ్బందులు తెచ్చారని జగ్గారెడ్డి మండిపడ్డారు. ఇప్పుడున్న రెండు మోటార్లు స్థానంలో మరో రెండు కొత్త మోటార్లు ఏర్పాటు చేయాలని సూచించారు. మిషన్ భగీరథతో సంబంధం లేకుండా డైరెక్ట్ గా పాత మంజీరా వాటర్ స్కీమ్ మాదిరిగా నేరుగా సంగారెడ్డి మున్సిపాలిటీకి మంజీరా నీళ్ళు సరఫరా చేయాలని, ఇది నా టార్గెట్ అని అధికారులకు జగ్గారెడ్డి స్పష్టంచేశారు. రాజంపేట ఫిల్టర్ బెడ్, ఇంటెక్వెల్ పునరుద్దరణ కు ప్రతిపాదనలు సిద్దం చేయాలని అధికారులకు సూచించారు.