కిక్కిరిసిపోతున్న మెట్రో బోగీలు.. నష్టాలు వస్తున్నాయంటున్న ఎల్‌అండ్‌టీ
హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలోనే రెండవ అతిపెద్ద నెట్‌వర్క్. ఎల్అండ్ టీ లెక్కల ప్రకారం రోజుకు సగటున 5లక్షల మంది ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్‌లో ఒక్కో సమయంలో నిలుచోవడానికి కూడా స్థలం దొరికే పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో ప్రయాణికులకు ఎదురవుతూ ఉంటుంది.

హైదరాబాద్, సెప్టెంబర్12 (విధాత): హైదరాబాద్ మెట్రో రైల్ దేశంలోనే రెండవ అతిపెద్ద నెట్‌వర్క్. ఎల్అండ్ టీ లెక్కల ప్రకారం రోజుకు సగటున 5లక్షల మంది ప్రయాణిస్తున్నారు. హైదరాబాద్ మెట్రో రైల్‌లో ఒక్కో సమయంలో నిలుచోవడానికి కూడా స్థలం దొరికే పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో ప్రయాణికులకు ఎదురవుతూ ఉంటుంది. అలా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు నిత్యం ప్రయాణికులతో కలకల లాడే మెట్రో రైల్‌కు నష్టాలేమిటి? మెట్రో మాల్స్ కూడా సగటున 80 శాతం ఆక్యుపెన్సీతో కొనుగోలుదారులతో నిత్యం రద్దీగా ఉంటాయి. ఇలాంటి సంస్థను నడపలేమని ఎల్అండ్ టీ కేంద్రానికి లేఖ రాయడం ఏమిటన్న చర్చ జరుగుతున్నది. మెట్రో రైల్‌ను ప్రారంభించిన వెంటనే ప్రయాణికుల రవాణా పెరిగింది. ప్రారంభమైన మొదటి సంవత్సరంలోనే రోజుకు 2 లక్షల మంది ప్రయాణించారు. మొత్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల ప్రయాణాలు సాగినట్టు ఎల్ అండ్ టీ మెట్రో రైల్ సంస్థ వెల్లడించింది. ఇంతే కాదు.. మెట్రో రైల్ నిర్మించిన మాల్స్‌తోపాటు మెట్రో స్టేషన్లలో నిర్మించిన షాపులు, రెస్టారెంట్లలో వ్యాపారం కూడా బాగానే సాగుతున్నది. 1.20 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీ వైశాల్యంలో నిర్మించిన నాలుగు మాల్స్‌లో 80 శాతం ఆక్యుపెన్సీ ఉన్నదని ఎల్ అండ్ టీ నే వెల్లడించింది. ప్రయాణికులు మెట్రో రైళ్లలో కిక్కిరిసి వెళుతున్నారు. నిర్మించిన వ్యాపార సముదాయాల్లో వ్యాపారం నడుస్తున్నది. అద్దెలు కూడా బాగానే వస్తున్నాయి. చివరకు మెట్రో రైల్ పార్కింగ్‌లలో భారీగానే పార్కింగ్ ఫీజులు వసూళ్లు చేస్తున్నారు. ఇలా వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగుతూనే ఉన్నా.. నష్టాలెందుకు వస్తున్నాయన్న ప్రశ్నలు సాధారణ ప్రజల్లో తలెత్తుతున్నాయి.
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్‌లో..
ప్రపంచవ్యాప్తంగా ప్రజా రవాణా ఎక్కడైనా లాభాపేక్షతో కాకుండా ప్రజాసంక్షేమంలో భాగంగానే ఉంటాయి. రవాణా వ్యవస్థ ఎంత బలంగా ఉంటే.. అంత అభివృద్ది జరుగుతుంది. కానీ దురదృష్టం కొద్దీ మన పాలకులు ప్రజా రవాణ వ్యవస్థను కూడా వ్యాపారం చేశారు. దీనికోసం రోడ్ల నిర్మాణాన్ని ప్రైవేట్ సంస్థలకు అప్పగించి ప్రజల నుంచి టోల్ టాక్స్ పేరిట తోలు తీస్తున్నారు. ఇదే తీరుగా మహా నగరం నడిమధ్యలో నిర్మించిన మెట్రో రైల్ కూడా పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్) పేరుతో ప్రైవేట్‌కు అప్పగించి ప్రభుత్వం చేతులు దులుపుకొన్నది. ఆనాటి ఒప్పందాల్లో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్‌ను ఎల్ అండ్ టీ నిర్మించి, నిర్వహించాలి.. ఇందులో రాష్ట్రానికి, కేంద్రానికి కూడా కొంత వాటా ఉన్నది. మెట్రో రైల్ ప్రాజెక్టును నిర్మించి, నిర్వహించడానికి మెట్రో రైల్ వెళ్లే ప్రాంతాల్లో 269 ఎకరాల అత్యంత ఖరీదైన భూములను ప్రభుత్వం ఎల్ అండ్ టీకి అప్పగించింది. ఈ మేరకు ఆనాడు టికెట్ల ద్వారా 45 శాతం ఆదాయం సమకూర్చకుంటామని, 50 శాతం భూమిని అభివృద్ధి చేసి వ్యాపారం చేయడం ద్వారా, మిగిలిన 5 శాతాన్ని తమ స్థలాన్ని ప్రకటనలకు ఇవ్వడం ద్వారా ఆదాయాన్ని ఆర్జిస్తామని తెలిపింది. అంతా బాగానే ఉన్నది. కానీ అసలు తిరసకాసు ఇక్కడే ఉంది.
ప్రయాణాల్లో మెట్రో సూపర్ సక్సెస్
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంలో బ్రహ్మాండంగా విజయవంతమైంది. ప్రయాణికులు తీసుకునే టికెట్ల ద్వారా 2024-25లో రూ.627.11 కోట్ల ఆదాయాన్ని సంపాదించుకున్నది. 2021-22లోనే టికెట్ల ద్వారా రూ. 319.62 ఆదాయం మెట్రో రైల్‌కు వచ్చింది. ఇలా ప్రయాణికుల నుంచి మంచి ఆదాయాన్ని సంపాదించుకున్న ఎల్ అండ్ టీ.. అద్దెలపై పెద్దగా దృష్టి కేంద్రీకరించలేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతున్నది. అగ్రిమెంట్ (టీఓడీ) ప్రకారం ఎల్ అండ్ టీ 18.5 మిలియన్ చదరపు అడుగుల కమర్షియల్ నిర్మాణాలు చేపట్టి, అద్దెలకు ఇవ్వడం, లేదా వ్యాపారాలు నిర్వహించడం చేయాలి. ఇప్పటి వరకు ఎల్ అండ్ టీ 3.625 మిలియన్ చదరపు అడుగల నిర్మాణం మాత్రమే చేసింది. ఇప్పటి వరకు నిర్మాణం అయిన వ్యాపార సముదాయం ద్వారా ఎల్ అండ్ టీకి 2024-25లో రూ.485.55 కోట్ల ఆదాయం వచ్చింది. 1.20 మిలియన్ చదరపు అడుగులున్న నాలుగు మాల్స్‌లో 80 శాతం ఆక్యుపెన్సీ ఉన్నదని ఎల్ అండ్ టీ తెలిపింది.
అలాంటప్పుడు 3.625 మిలియన్ చదరపు అడుగులకు ఏడాదికి రూ.485 కోట్ల ఆదాయం వస్తే అదే మొత్తం 18.5 మిలియన్ చదరపు అడుగుల కమర్షియన్ నిర్మాణాలు పూర్తి చేసి వ్యాపారస్తులకు అద్దెలకు ఇస్తే దాదాపు రూ. 2 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేది కదా అని వ్యాపార రంగ నిపుణులు చెపుతున్నారు. వాస్తవంగా గత ఏడాది 2023-24లో కమర్షియల్ కార్యకలాపాల ద్వారా రూ.796 కోట్ల ఆదాయం వచ్చింది.
ఆదాయం పెంపుపై దృష్టిపెడుతున్నారా?
ఎల్ అండ్ టీ వాస్తవంగా ఆదాయం పెంపుపై కేంద్రీకరించడం లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి.
2024-25లో రూ. 625.88 కోట్ల నష్టం వచ్చినట్లు చెపుతున్నది. కానీ ప్రభుత్వం కేటాయించిన భూముల్లో నిర్మాణాలు చేసి కమర్షియల్ కార్యకలాపాలు కొనసాగిస్తే తక్కువలో తక్కువ ఏడాదికి రూ 2000 కోట్ల ఆదాయం వచ్చేదని, దీని ద్వారా ఎల్ అండ్ టీ నష్టాల నుంచి బయట పడే అవకాశం ఉన్నప్పటికీ ఈ దిశగా ఎందుకు కేంద్రీకరించలేదన్న చర్చ పరిశీలకుల్లో జరుగుతున్నది. దీనికి ఏమైనా రాజకీయ కారణాలున్నాయా? అన్న చర్చ కూడా జరుగుతోంది.
సర్కారుతో ఎల్‌అండ్‌టీకి లొల్లి?
ఎల్ అండ్ టీ గతంలో కూడా రెండు సార్లు మెట్రో రైల్‌ను విక్రయించడానికి సిద్ధమైంది. దీనిని కొనుగోలు చేయడానికి గ్రీన్ కో సంస్థ ముందుకు వచ్చినట్లు కూడా అప్పట్లో ప్రచారం జరిగింది. సర్కారు అనుమతి ఇవ్వకపోవడంతోనే ఎల్ అండ్ టీ కొనసాగిస్తున్నదని సీనియర్ జర్నలిస్ట్ ఒకరు తెలిపారు. ఇదే సమయంలో మరో చర్చ కూడా రాజకీయ వర్గాలలో జరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అవినీతిలో ఎల్ అండ్ టీపై కూడా ఆరోపణలు వెలువడ్డాయి. కుంగిన మేడిగడ్డ బ్యారేజీ విషయంలో ఎల్అండ్‌టీ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ సంస్థ పెద్దలను కలువడానికి కూడా ఇష్టం చూపడం లేదన్న చర్చ రాజకీయ వర్గాలలో జరుగుతోంది. మరో వైపు మెట్రో పేజ్-2ను ప్రభుత్వమే స్వయంగా నిర్మించి, నిర్వహించడానికి సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్రప్రభుత్వం ప్రతిపాదనలపై కొర్రీలు వేసిన కేంద్రం దీనికి ఎలాంటి అనుమతులు ఇవ్వకుండా ప్రతిపాదనలను పక్కకు పడేసింది. ఇటువంటి సమయంలో ఎల్ అండ్ టీ హైదరాబాద్ మెట్రోను తాము నిర్వహించలేమని కేంద్రానికి లేఖ రాయడం చర్చ నీయాంశమైంది.