Sushila Karki -India | ఎవరీ సుశీలా కార్కీ ? – భారత్‌తో అనుబంధం ఉన్న నేపాల్ కొత్త ప్రధాని
నేపాల్ ఆపద్ధర్మ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన సుశీలా కార్కీకి భారత్‌తో ప్రత్యేక అనుబంధముంది. వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకున్న సుశీల తన భర్త దుర్గాప్రసాద్ సుబేదిని ఇక్కడే తొలిసారి కలుసుకున్నారు.

Sushila Karki -India | నేపాల్‌లో రాజకీయ సంక్షోభానికి తెరపడింది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఖాట్మండూ శీతల్ నివాస్‌లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం తర్వాత వెంటనే కొత్త కేబినెట్ సమావేశం కూడా జరిగింది. ఈ నిర్ణయం అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్, జెన్ జీ ప్రతినిధులతో చర్చల తర్వాత ఖరారైంది. KP ఒలీ రాజీనామా చేయడంతో ఏర్పడిన ఖాళీని భర్తీ చేస్తూ ఈ చారిత్రక నిర్ణయం తీసుకున్నారు.
సుశీలా కార్కీ (73) రాజకీయ నేపథ్యంలేని వ్యక్తి. 2016 నుంచి 2017 వరకు నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. అవినీతి పట్ల అత్యంత కఠిన వైఖరి పాటించినందువల్ల ఆమె విపరీతమైన ప్రజాదరణ పొందారు. అందుకే భారీ నిరసనల సమయంలో కూడా యువత ఆమెను ప్రధానిగా చేయాలని డిమాండ్ చేశారు. ఆమె ఎంపికను బంగ్లాదేశ్‌లో విద్యార్థుల ఆందోళనల తరువాత నోబెల్ పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్‌కు ఇచ్చిన తాత్కాలిక ప్రభుత్వ పదవితో పోలుస్తున్నారు.
1952లో తూర్పు నేపాల్‌లో ఒక రైతు కుటుంబంలో జన్మించిన కార్కీ, ఏడుగురిలో తొలి సంతానంగా పెరిగారు. ఆమె కుటుంబానికి 1959లో తొలి ప్రజాస్వామ్య ప్రధానమంత్రి అయిన బి.పి. కొయిరాలాతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. 1972లో మహేంద్ర మోరంగ్ ప్రాంగణం నుంచి బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పూర్తిచేసి, 1975లో బెనారస్ హిందూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో పీజీ చేశారు. 1978లో ఖాట్మండూ లోని త్రిభువన్ యూనివర్సిటీ నుండి లా డిగ్రీ పొందారు. న్యాయవాద వృత్తితో పాటు కొంతకాలం లెక్చరర్‌గా కూడా పనిచేశారు.
2009లో ఆమె సుప్రీంకోర్టులో తాత్కాలిక న్యాయమూర్తిగా నియమితులై, 2010లో శాశ్వత జడ్జిగా పదోన్నతి పొందారు. 2016లో ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కానీ 2017లో ఆమెపై రాజకీయ పార్టీలు అభిశంసన తీర్మానం ప్రతిపాదించారు. ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత రేపింది. నిరసనల ఒత్తిడితో దాన్ని ఉపసంహరించుకున్నారు. కానీ, ఆ తరువాత నెల రోజులకే ఆమె రిటైర్ అయ్యారు. తన పదవీకాలంలో మాజీ సమాచార మంత్రి జయప్రకాశ్ ప్రసాద్ గుప్త అవినీతి కేసులో శిక్ష విధించడం సహా పలు ముఖ్య కేసుల్లో తీర్పులు ఇచ్చారు.
భారత్‌తో సుశీల కార్కీ అనుబంధం
ఆమె వ్యక్తిగత జీవితంలో భారతదేశంతో అనుబంధం ప్రత్యేకంగా నిలిచింది. BHUలో చదువుతున్నప్పుడు దుర్గాప్రసాద్ సుబేదిని కలిశారు. సుబేది ఆ సమయంలో నేపాల్ కాంగ్రెస్ యువ నాయకుడు. తరువాతి క్రమంలో ఆయన్నే ఆమె వివాహం చేసుకున్నారు. సుబేది 1973లో తన సహచరులతో కలిసి నేపాల్ ఎయిర్‌లైన్స్ విమానాన్ని హైజాక్ చేసిన సంఘటనలో కీలక పాత్ర పోషించారు. విమానాన్ని బీహార్‌లో ల్యాండ్ చేసి, అందులో ఉన్న నలభై లక్షల నేపాలీ రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుతో నేపాల్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక పోరాటం కోసం ఆయుధాలు కొనుగోలు చేసింది. ఈ హైజాక్‌లో పాల్గొన్నవారిని భారత అధికారులు అరెస్టు చేసి రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించారు. తరువాత 1980 రిఫరెండం ముందు వారు మళ్లీ నేపాల్‌కు తిరిగి వెళ్లారు.
ఇటీవల KP ఒలీ ప్రభుత్వం విధించిన సోషల్ మీడియా నిషేధం, అవినీతి ఆరోపణల వల్ల చెలరేగిన హింసలో కనీసం 51 మంది మృతి చెందగా, 1,300 మందికి పైగా గాయపడ్డారు. కర్ఫ్యూలను అతిక్రమించిన వారిపై పోలీసులు కాల్పులు జరపడంతో ఈ ప్రాణనష్టం సంభవించింది. ఖాట్మండూలోని ఆసుపత్రులన్నీ శవాలతో నిండిపోయాయి. అయితే ప్రస్తుతం పరిస్థితులు క్రమంగా సాధారణమవుతున్నాయి. దుకాణాలు మళ్లీ తెరుచుకోగా, సైన్యం వెనక్కి వెళ్లిపోయింది. పోలీసు దళాలు మాత్రం వీధుల్లో పహారా కాస్తున్నాయి.
ఈ నేపధ్యంలో సుశీలా కార్కీ ప్రమాణ స్వీకారం నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయంగా చెప్పవచ్చు. దృఢత్వం, అవినీతి వ్యతిరేక వైఖరి కలిగిన ఆమె ఇప్పుడు ఆపద్ధర్మ ప్రధానిగా ఎన్నికల వరకు దేశాన్ని ముందుకు నడిపించనున్నారు.