Sushila Karki | నేపాల్ తొలి మహిళా ప్రధానమంత్రిగా సుశీలా కార్కీ
నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కీ ఆ దేశానికి తొలి మహిళా ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నడిపించనున్న సుశీల ఎన్నికల వరకు తాత్కాలిక ప్రధానిగా ఉంటారు.

Sushila Karki | నేపాల్ రాజకీయాల్లో చారిత్రక పరిణామం చోటుచేసుకుంది. మాజీ చీఫ్ జస్టిస్ సుశీలా కార్కీ తాత్కాలిక ప్రధానమంత్రిగా ఎంపికయ్యారు. ఈ రాత్రి 9 గంటలకు ఆమె ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నియామకంతో నేపాల్ చరిత్రలో తొలిసారి ఒక మహిళ ప్రధానమంత్రి పదవిని చేపట్టారు.
గత మూడు రోజులుగా సోషల్ మీడియా ప్లాట్‌ఫారంలపై నిషేధం, అవినీతి ఆరోపణలపై యువత, ముఖ్యంగా Gen-Z నిరసనకారులు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు కొనసాగించారు. కెపీ ఓలీ ప్రభుత్వంపై ఆగ్రహం పెరిగి చివరికి ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది. నిరసనల నేపథ్యంలో అధ్యక్షుడు రామ్ చంద్ర పౌడెల్, ఆర్మీ చీఫ్ అశోక్ రాజ్ సిగ్దెల్, Gen-Z ప్రతినిధులు కలిసి చర్చలు జరిపారు. అందరి అంగీకారంతో సుశీలా కార్కీని నేపాల్ 39వ ప్రధానమంత్రిగా నియమించాలని నిర్ణయించారు.
ఈ ఆపద్ధర్మ ప్రభుత్వంలో చిన్న మంత్రివర్గం ఉంటుంది. మొదటి సమావేశం ఈ రాత్రికే జరగనున్నట్లు సమాచారం. కొత్త కేబినెట్ పార్లమెంట్, రాష్ట్ర అసెంబ్లీలు రద్దు చేసి త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని ప్రతిపాదించేందుకు అవకాశం ఉంది.
ప్రారంభంలో నిరసనకారుల మధ్య అభిప్రాయ భేదాలు కనిపించాయి. విద్యుత్ సంక్షోభం పరిష్కరించిన ఇంజనీర్ కుల్మాన్ ఘిసింగ్ పేరు కూడా వినిపించింది. కాఠ్మాండూ మేయర్ బాలేంద్ర షా (బాలెన్) కూడా ప్రధానిగా చర్చలు జరిగాయి కానీ, ఆయన ఈ బాధ్యత తీసుకోవడానికి ఇష్టపడలేదు. చివరికి యువత మద్దతు ఎక్కువగా లభించింది కార్కీకే.
సుశీలా కార్కీ 2016–2017లో నేపాల్ తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. ఆమె అవినీతికి వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకోవడం వల్ల విస్తృతంగా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా యువతలో ఆమెకు మంచి ఆదరణ ఉంది. భారత్‌లోని బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నేపాల్‌కు భారత్ అనేక విధాలుగా సహాయం చేసిందని ఆమె స్పష్టం చేశారు.
ఈ ప్రమాణ స్వీకారంతో నేపాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. సుశీలా కార్కీ నాయకత్వం సాధారణ ఎన్నికల వరకు దేశాన్ని ముందుకు నడిపించనుంది. తొలిసారిగా ఒక మహిళ ప్రధాని కావడం నేపాల్ చరిత్రలో మరువలేని ఘట్టంగా నిలిచిపోనుంది.